తన 32 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పంచాయితీ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తీవ్రవాదంలో ఉన్నామో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏకపక్షంగా దౌర్జన్యంగా సిఐలే దగ్గరుండి డబ్బులిచ్చి పంచిస్తున్నారని....ఇలాంటి దారుణం ఎక్కడా చూడలేదని జలీల్ ఖాన్ ఆరోపించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని... కానీ ఏ రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లలేదని ఆయన గుర్తుచేశారు.

పోలీసులంటే సౌమ్యంగా ఉండాలి కాని రొమ్ము విరిచి మాట్లాడుతున్నారని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. నా‌ ఇంటి దగ్గర షాడో పార్టీ పెట్టారన్న ఆయన అవినీతి పరుడైన మంత్రి ఇంటి ముందు షాడో పార్టీ పెట్టాలి కాని నా ఇంటి ముందు ఎందుకంటూ నిలదీశారు.

టిడిపి నేతలు ఎక్కడా తిరగకూడదు కాని వైసిపి నేతలు, చిల్లర నేతలు బూత్‌ల వద్ద రౌడీయిజం చేశారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వైసిపి నేతలు నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఓటింగ్ శాతం తక్కువ కావడానికి కారణం పోలీసులేనని.. అధికార పార్టీకి గులాం గా పోలీసులు వ్యవహరించారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వైసిపి నేతలు ప్రలోభాలకు గురి చేసినా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లో ప్రజలు స్వచ్చందంగా‌ ఓట్లు వేసేందుకు వచ్చారని ఆయన ప్రశంసించారు.

దుర్గగుడి లో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినా‌ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌లో వైసీపీ సీట్లిచ్చిన వారంతా‌ దొంగలు, ‌రౌడీ షీటర్లేనని జలీల్ ఖాన్ ఆరోపించారు.

చంద్రబాబు ను విమర్శించే స్ధాయి వెల్లంపల్లికి లేదని.. ప్రతిపక్షనేత ఇంట్లో పాచిపని చేసుకొనే స్ధాయి వెల్లంపల్లిదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరుపై రేపు చంద్రబాబును కలుస్తానని.. త్వరలోనే డిజిపి, ఎన్నికల అధికారులను కలిసి... వన్ టౌన్, కొత్తపేట సిఐలు, ఏసీపీలను మార్చాలని కోరతానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.

పోలీసు వ్యవస్ధ సీరియస్‌గా‌ ఉంటే వైసిపి ఖతం అవుతుందని... పోలీసులు సాదాసీదాగా ఉండడం వలనే ప్రభుత్వం ఇంకా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్ ను టిడిపి కైవసం చేసుకోవడం ఖాయమని జలీల్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు.