గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమలపై ఈ నెల 11న జరిగిన దాడి ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై డీజీపీ కార్యాలయంలో మీడియా సమక్షంలో విచారణ జరిపితేనే తాము సహకరిస్తామని లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు బొండా ఉమా మహేశ్వరరావు.

విచారణ పేరుతో పోలీసులు తమను మాచర్ల పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారని, అక్కడికి వెళ్తే తమపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని బొండా అనుమానం వ్యక్తం చేశారు.

Also Read:పిన్నెల్లి కాల్ డేటా తీస్తే కుట్ర గుట్టు తేలుతుంది: బొండా ఉమా

రాష్ట్ర పోలీసుల తీరు చూస్తుంటే తమపై జరిగిన హత్యాయత్నం ఎందుకు ఫెయిల్ అయ్యిందోనని బాధపడుతున్నట్లుగా కనిపిస్తోందని బొండా ఆరోపించారు. దాడి గురించి అన్ని వివరాలు తెలిసి కూడా డీజీపీ తమ కాల్‌డేటాను పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

పోలీసులు తమ కాల్ డేటాతో పాటు దాడిలో పాల్గొన్న తుర్క కిశోర్, మాచర్ల సీఐ, ఎస్ఐ, గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిల కాల్ డేటాను సైతం పరిశీలించాలని ఉమా డిమాండ్ చేశారు.

Also Read:హత్యకు కుట్ర: విచారణకు పోలీసుల నోటీసుపై బుద్దా, బొండా రిప్లై

తమపై జరిగిన దాడి విషయంలో ఎమ్మెల్యే, ఆయన సోదరుడిని వదిలిపెట్టి అమాయకులపై కేసులు నమోదు చేశారని బొండా డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాము హైకోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.