గుంటూరు: మాచర్ల ఘటనపై పోలీసు విచారణకు హాజరు కావడానికి టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న నిరాకరించారు. మాచర్ల దాడి ఘటనపై విచారణకు హాజరు కావాలని వారిద్దరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దానిపై టీడీపీ నేతలు స్పందించారు. 

గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదని, అందువల్ల విచారణకు హాజరు కాబోమని వారు తెలిపారు. నోటీసుల పేరుతో పిలిచి హత్యకు కుట్ర చేశారని వారు మీడియాకు చెప్పారు. అభ్యంతరాలు ఉంటే బాధితుల వద్దకే విచారణాధికారి వెళ్తారని వారు చెప్పారు. 

Also Read: మాచర్ల దాడి... ధ్వంసమైన కారుతో విజయవాడ సిపి ఆఫీసుకు బోండా ఉమ

మాచర్ల దాడి ఘటనపై విచారణాధికారిగా గురజాల డీఎస్పీని నియమించారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలోని మాచర్లలో బుద్ధా వెంకన్న, బొండా ఉమా మహేశ్వర రావు కారుపై దుండగులు దాడి చేశారు. వారిపై దాడి చేసినవారు వైసీపీ కార్యకర్తలని తేలింది. 

రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉన్నామని గుంటూరు రేంజ్ ఐజీ జె. ప్రభాకర రావు మాచర్ల ఘటనపై స్పందిస్తూ అన్నారు. మాచర్ల ఘటన జరిగిన రోజును గురజాల డీఎస్పీ తెగించి తమను రక్షించాడని బాధితులే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Also Read: టీడీపీ నేతల కారుపై దాడి... నిందితుడికి బెయిల్, వార్డ్ సభ్యుడిగా నామినేషన్