అమరావతి: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ పై ప్రశంసలు కురిపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రివర్స్ టెండరింగ్ తో తేడా వస్తుందని ఊహించాను  కానీ మరీ ఇంత తేడా వస్తుందని ఊహించలేదన్నారు. 

వైసీపీ ప్రభుత్వం నిజాయతీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని అందుకు సీఎం జగన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏ టెండర్ అయినా జ్యూడిషియల్ విచారణ తర్వాతే టెండర్ కు అనుమతి ఇవ్వడం మంచి పరిణామమన్నారు.  

మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ రూ.700 కోట్లు తక్కువకు టెండర్‌ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత తక్కువకు ఎలా ముందుకు వచ్చారో అర్థం కావడం లేదన్నారు. కింది స్థాయిలో అవినీతి ఉందని దాన్ని తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించాలని ఉండవల్లి సూచించారు. 

పాలకుల్లో అంతా నిజాయితీగా పనిచేయక తప్పదనే పరిస్థితి తీసుకురావాలని కోరారు. పాలనలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. 57 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అదేశాశ్వతం అనుకోవద్దని హితవు పలికారు.  

ప్రజల్లో మంచి పేరుతో పాటు తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం జగన్‌ ముందున్న కర్తవ్యం అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. 

జగన్‌ ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిగా నడిపించాడని కొనియాడారు. ఇప్పుడు తేడా రానివ్వొద్దని సూచించారు. ప్రభుత్వంపై సీరియస్‌గా ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని మాజీ ఎంపి ఉండవల్లి సెటైర్లు వేశారు.  

పాలన విషయంలో సీఎం జగన్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్‌ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు పలు సూచనలు చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అంబేడ్కర్ వారిని సమర్థించలేదు, వాస్తవాలే మాట్లాడారు : మాజీ ఎంపీ ఉండవల్లి