రాజమహేంద్రవరం: మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని ఇద్దరూ ఒకే విధానాలతో ముందుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.  

జాతిపిత మహాత్మగాంధీజి ఏం చెప్పారో నెహ్రూ అదే చేశారని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే కశ్మీర్ లో కేంద్రం కర్ఫ్యూ విధించడంపై మండిపడ్డారు. 

అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్కడికి ఎవరినీ వెళ్లనీయకుండా చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. 

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్తున్నారని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ కూడా భారత్ దేనని చెప్పుకొచ్చారు. గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్‌ పార్టీని అంబేడ్కర్ ఏనాడు సమర్థించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ వాస్తవాలను మాత్రమే చెప్పారని ఉండవల్లి స్పష్టం చేశారు. 

ఆర్టికల్ 370 రద్దు చేయడం మంచి నిర్ణయమేనని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తాననడంలో ఎలాంటి తప్పులేదన్నారు. బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతం మీద అని గుర్తు చేశారు. ఆర్టికల్‌ రద్దు అనేది డిప్లమసీతో చేయాలే తప్ప సైన్యంతో కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ జిన్నా తాత రాజ్‌పూత్‌ వంశానికి చెందినవారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. అబ్దుల్‌ భట్‌ కూడా బ్రాహ్మణుడేనని చెప్పుకొచ్చారు. అయితే వారంతా ఇస్లాంలోకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. సాయిబాబా గుడికి వెళ్లొద్దని శంకరాచ్యా పీఠాధిపతే క్లియర్ గా చెప్పారని గుర్తు చేశారు. 

నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఈరోజు గూగుల్‌ సెర్చ్‌లో ఆర్టికల్‌ 370 అనేది లేకుండా పోయిందన్నారు. కశ్మీర్‌ ఎంపీలు కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తారన్న ఆయన కేంద్రప్రభుత్వం గాంధీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు.