చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేశ్. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఖరారు ఖాయం కావడమని ఆయన జోస్యం చెప్పారు. 

వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన మద్ధతును వైసీపీ సరిగా వినియోగించుకోలేదని.. ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శిస్తే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని టీజీ వెంకటేష్ ఆగ్రహ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచింది కానీ.. వైసీపీకి కాదన్నారు. అయితే ప్రజల్లో బీజేపీ, వైసీపీల గురించి తప్పుడు సంకేతాలు వెళ్లాయని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఖరారు ఖాయం కావడమని ఆయన జోస్యం చెప్పారు. పవన్ బీజేపీతోనే కలిసి నడుస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే తాము ప్రయత్నిస్తామన్నారు. 

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో పొత్తులు వుంటాయన్న పవన్ కల్యాణ్.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే త్రిముఖ పోటీలో బలికావడానికి జనసేన సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. తనకు ఏ పార్టీపైనా ప్రేమ , ద్వేషం లేదన్న ఆయన.. ఈసారి జనసేనకు ప్రత్యర్ధి వైసీపీయేనని స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది తర్వాత చూద్దామని.. ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించడమే టార్గెట్ అని పవన్ పేర్కొన్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని అంటున్నారని.. జూన్‌లో తాను ప్రచారం మొదలుపెడతానని పవన్ తెలిపారు.

Also Read: ఈసారి ఖచ్చితంగా పొత్తులతోనే .. సీఎం ఎవరవ్వాలో ఎన్నికల తర్వాత చూద్దాం : పవన్ వ్యాఖ్యలు

బలమున్న స్థానాల్లో ఎన్నికలకు వెళదామని.. మనకు వచ్చే స్థానాలను బట్టే సీఎం పదవి గురించి అడగటానికి వీలుంటుందన్నారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ ఎదుగుతుందని.. 6 నుంచి 7 స్థానాలు గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేడు జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు. కాపులను వైసీపీ నాయకులు తిట్టినప్పుడు, రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినప్పుడు.. 60 శాతం మంది కాపులు జగన్‌కు ఓటు ఎందుకు వేశారని పవన్ ప్రశ్నించారు. ఏపీకి కావాల్సింది మంచి నాయకులు కాదని.. జనంలోనే పరివర్తన రావాలని ఆయన సూచించారు.