హైదరాబాద్: ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె.రోజాను సినీ ఇండస్ట్రీకి, రాజకీయరంగానికి పరిచయం చేసింది తానేనని చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ చెప్పుకునేవారు. 

రోజాను సినీ రంగానికి పరిచయం చేసింది తానేనని పదేపదే చెప్పుకొచ్చారు. ప్రేమ తపస్సు చిత్రంతో రోజాను ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు ఇటీవలే శివప్రసాద్ స్పష్టం చేశారు. ప్రేమ తపస్సు చిత్రంలో రాజేంద్రప్రసాద్ సరసన రోజాకు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అక్కడితో వదిలెయ్యలేదని అనేక సినిమాల్లో ఛాన్స్ ఇప్పించినట్లు పలుమార్లు శివప్రసాద్ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే సినీ రంగంలో కీలక స్థానంలో ఉన్న రోజాను రాజకీయాల్లోకి కూడా పరిచయం చేసింది తానేనని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో తీసుకురావడంతోపాటు కీలక పదవులు కట్టబెట్టినట్లు పలు వేదికల సాక్షిగా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా అవకాశం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. 

అయితే రెండేళ్ల క్రితం ఈ వ్యవహారాలన్నింటిని బయటపెట్టారు శివప్రసాద్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పందించారు శివప్రసాద్. 

రోజాను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసి పెద్ద తప్పు చేశానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజకీయాల్లోకి కూడా తీసుకువచ్చి మరో పెద్ద తప్పు చేశానని గంటా పథంగా చెప్పుకొచ్చారు. ఆనాడు చంద్రబాబును పొగిడిన రోజా నేడు విమర్శలు గుప్పించడం దురదృష్టకరమంటూ తిట్టిపోసిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

హోదా ఉద్యమంలో మాజీ ఎంపీ శివప్రసాద్ స్పెషల్ రోల్: విచిత్ర వేషాలతో ప్రత్యేక ఆకర్షణ

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత