గతంలో డబ్బుల్లేక ఓడిపోయానని.. కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బులున్నాయని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. కన్నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలుస్తారని .. తాను ఆయనకు సపోర్ట్ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానన్నారు. గతంలో డబ్బుల్లేక ఓడిపోయానని.. కానీ ఇప్పుడు తన దగ్గర డబ్బులున్నాయని రాయపాటి వ్యాఖ్యానించారు. డబ్బున్నా, లేకున్నా.. ఈసారి టీడీపీ వేవ్ పక్కా అని ఆయన జోస్యం చెప్పారు. తన కుమారుడు రంగబాబుకు టికెట్ ఇవ్వాలని .. అది సత్తెనపల్లి అయినా, పెదకూరపాడు అయినా పర్లేదన్నారు. తన తమ్ముడి కుమార్తె రాయపాటి శైలజకు కూడా టికెట్ కోరుతున్నట్లు సాంబశివరావు తెలిపారు. అంతేకాదు.. వాళ్లిద్దరికి టికెట్లు ఇస్తే తనకు ఇవ్వకపోయినా పర్లేదన్నారు. 

నరసరావుపేటకు స్థానికులే అభ్యర్ధిగా వుండాలని రాయపాటి సాంబశివరావు తేల్చిచెప్పారు. తనకు వయసు పైబడిన మాట వాస్తవమేనన్న ఆయన.. అన్ని చోట్లా తిరుగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తామని.. తాను ఏ ఇన్‌ఛార్జ్‌కు వ్యతిరేకం కాదన్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని రాయపాటి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు.

Also REad: 12 ఏళ్ల తర్వాత కన్నా,రాయపాటి మధ్య రాజీ: రాయపాటిపై పరువు నష్టం దావా వెనక్కి

అయితే గురజాలలో మాత్రం కరప్షన్ లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. ఇక తన చిరకాల ప్రత్యర్ధి కన్నా లక్ష్మీనారాయణపైనా రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నాకు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలుస్తారని .. తాను ఆయనకు సపోర్ట్ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నాతో ఇప్పటికీ రాజీపడలేదని.. కానీ చంద్రబాబు కోసం, పార్టీ కోసం పనిచేస్తామన్నారు. తనను పదేళ్లపాటు కన్నా లక్ష్మీనారాయణ ఏడిపించారని, తననే కాకుండా చంద్రబాబునూ ఏడిపించారని.. తర్వాత కోర్టులో రాజీపడ్డారని రాయపాటి అన్నారు.