విజయవాడ: గెలిచినా, ఓడినా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయమని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా పవన్ స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీకి దిగారని... ఇది ఆయన రాజకీయ స్థిరత్వాన్ని సూచిస్తుందన్నారు. 

ఇక సీఎం వైఎస్ జగన్ తో వున్న స్నేహాన్ని లగడపాటి గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు ముందు నుంచే సీఎం వైఎస్ జగన్‌తో  స్నేహం వుందన్నారు. సీఎం అవ్వాలన్న జగన్ ఆకాంక్ష నెరవేరిందని... మరో మూడేళ్ల పాలన తర్వాతే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు లగడపాటి రాజగోపాల్. 

టీటీడీపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా ఉండాలని కోరుతూ కోర్టులో కేసు వేస్తానన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలపై కూడా లగడపాటి స్పందించారు.  వేలాది కోట్ల రూపాయాలు ఆదాయం వచ్చే టీటీడీ లాంటి సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

 దక్షిణాదిన ఆలయాలకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాదిన ఆలయాలకు ఆదాయం తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఉత్తరాది ఆలయాలకు స్వతంత్రంగా పాలకవర్గాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ విషయాలపై కోర్టులు సరైన నిర్ణయం తీసుకొంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీపై ప్రభుత్వ పెత్తనం ఉండొద్దనేది ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్. గతంలో నటరాజస్వామి ఆలయంపై ప్రభుత్వ పెత్తనాన్ని లేకుండా తాను చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.టీటీడీపై ప్రభుత్వ పెత్తనం లేకుండా చేయాలని ఆయన కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.