అమరావతి: ఆంధ్రా ఆక్టోప‌స్ గా పేర్గాంచిన లగడపాటి రాజగోపాల్ ఎన్నికలకు ఒకరోజు ముందే ప్రెస్మీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.  ఈనెల 19 సాయంత్రం వ‌ర‌కు స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించకూడదని ఆంక్షలు ఉన్నాయి. 

అయితే లగడపాటి మాత్రం ఒకరోజు ముందే అంటే 18 సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చెయ్యడంపై జోరుగా చర్చ సాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో లగడపాటి ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. 

అయితే ఈ ప్రెస్మీట్ లో ఏపీ సర్వే ఫలితాలు వెల్లడిస్తారా...? లేక తెలంగాణ తరహాలో తొలుత టీజర్ విడుదల చేస్తారా ....? లేకపోతే ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయో అంశంపై ముందే హింట్ ఇవ్వబోతున్నారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

గత కొంతకాలంగా సర్వేలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లగడపాటి ఆంధ్రా ఆక్టోపస్ గా పేర్గాంచారు. పలు సర్వేలతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఆయన సర్వే ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. 

టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పిన లగడపాటికి ఆ తర్వాత వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి ఖంగుతిన్నారు. అనంతరం ఆయన అజ్ఞాతంలో ఉన్న ఆయన ఎట్టకేలకు తెలంగాణలో తన సర్వే ఫెయిల్ కావడంపై వివరణ ఇచ్చుకున్నారు.  

తెలంగాణ సర్వే ఫ‌లితాల్లో వైఫల్యం, ఏపీ ఫ‌లితాల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాల గురించి మే 19న సాయంత్రం ప్రకటిస్తానని లగడపాటి ఇప్పటికే ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఒకరోజు ముందే ప్రెస్మీట్ పెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. 

మరోవైపు ఏపీ ఫలితాలు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందంటూ లగడపాటి ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఏపీలో ఎన్నికల అనంతరం లగడపాటి అమెరికాలో తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు నిర్వహించిన సమావేశానికి లగడపాటి రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఆ సమావేశంలో ఏపీలో ప్ర‌జ‌లు సంక్షేమం..అభివృద్దికి మ‌ద్ద‌తుగా నిలిచార‌ని వ్యాఖ్యానించారు. దీంతో లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే బూస్ట్ ఇచ్చే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు వేర్వేరు కామెంట్లు చేశారు. ఎన్నికలు జరిగిన మెుదటి రెండు రోజులు టీడీపీ 150 ప్లస్ అంటూ చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత 130 సీట్లు ఖాయమన్నారు. ఆ తర్వాత 120 సీట్లు ప్రస్తుతం 110 సీట్లు అంటూ చెప్పుకొస్తున్నారు. 

అంతేకాదు ఈనెల 19న విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ను నమ్మెుద్దు అంటూ కూడా పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం నుంచి తమదే విజయం అంటూ ధీమాగా ఉంటుంటే పార్టీ అధినేత వ్యాఖ్యలతో నేతలు గందరగోళానికి గురవుతున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు బూస్ట్ గా టీజర్ విడుదల చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఆంధ్రా ఆక్టోపస్ ఎన్నికల ఫలితాలపై టీజర్ రిలీజ్ చేస్తారా లేక తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ఫెయిల్ కావడంపై వివరణ ఇస్తారా అన్నది వేచి చూడాలి మరి.