అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్టయ్యారు. జ్యూడీషియల్ సిబ్బందిపై దూషణ, విధుల ఆటంకం కేసులో హర్షకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై సెక్షన్ 353, 354, 323, 506 కింద కేసులు నమోదు చేశారు. కాసేపట్లో ఆయనను 7వ అదనపు కోర్టులో హాజరుపరచనున్నారు.

విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తోయటం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ పై  త్రిటౌన్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. 

Also Read:ఇంకా దొరకని మాజీ ఎంపీ హర్షకుమార్ : సీఐపై సస్పెన్షన్ వేటు

గత నెల 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ అక్కడకు వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించినట్లు ఏవో సీతారామరాజు ఫిర్యాదు చేశారు. 

విధులు నిర్వహిస్తున్న కోర్టు ఉద్యోగులను బెదిరించేలా హర్షకుమార్ వ్యవహరించారని, ఉద్యోగులను నెట్టడం కూడా చేశారని అలాగే మహిళా ఉద్యోగినులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read:జగన్ దద్దమ్మ: ఢిల్లీలో దర్శనమిచ్చిన హర్షకుమార్

జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన త్రిటౌన్ పోలీసులు హర్షకుమార్ ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హర్షకుమార్ ను పట్టుకునేందుకు నాలుగు బృందాలను నియమించింది పోలీస్ శాఖ. నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.