వైఎస్ జగన్ ప్రభుత్వం తనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. సోమవారం ఢిల్లీ నుంచి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజల ముందుకు వచ్చిన ఆయన.. తనపై ఉన్న కేసు గురించి వెల్లడించారు.

జిల్లా కోర్టు సమీపంలో రెవెన్యూ శాఖకు చెందిన భవనాన్ని న్యాయస్థానానికి అప్పగించే సమయంలో వివాదం చెలరేగిందన్నారు. సదరు భవనంలో కొందరు 40 ఏళ్లుగా ఉంటున్నారని.. వారిని ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారని హర్షకుమార్ తెలిపారు.

బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో తనను వారు తనను కలిశారని వెల్లడించారు. దీంతో తాను అక్కడికి వెళ్లానని అప్పటికే ఆ భవనాన్ని కూల్చివేశారని.. న్యాయస్థానానికి కూతవేటు దూరంలోనే ఇంత అన్యాయం జరిగిందని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంలో తనను ఇరికించేందుకు గాను న్యాయస్థానానికి చెందిన మహిళా సిబ్బందితో తాను అసభ్యకరంగా ప్రవర్తించానంటూ కోర్టు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారని హర్షకుమార్ తెలిపారు.  

ఈ వ్యవహారంలో కలగజేసుకోవాల్సింది రెవెన్యూ శాఖ మాత్రమేనని మధ్యలో కోర్టుకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. కరెంట్ కోతలు నివారించాలని ముఖ్యమంత్రిని కాస్త ఘాటుగా హెచ్చరించినందుకే తనపై జగన్ కక్షగట్టారని హర్షకుమార్ తెలిపారు.

గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను వైసీపీ కార్యకర్తలకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. వరదలు, బోటు ప్రమాదం సమయంలో కిందకు దిగకుండా ఏరియల్ సర్వేలు చేయడమేంటని హర్షకుమార్ మండిపడ్డారు.

బోటు ప్రమాదం జరిగి 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకు బోటును బయటకు తీయలేకపోతున్నారన్నారు. లక్షా 30 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలను పొందిన వారిలో అత్యధికులు వైసీపీ సానుభూతిపరుల కుటుంబసభ్యులకే దక్కాయని హర్షకుమార్ ఆరోపించారు.

సొంత బాబాయ్ హత్య కేసును నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అతిగతిలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న కోడికత్తి శ్రీను ప్రాణాభయంతో కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడని హర్షకుమార్ గుర్తుచేశారు.

తనపై పెట్టింది తప్పుడు కేసని.. జగన్‌లా తనపై అక్రమాస్తులు కూడబెట్టలేదని, రాజసౌధాలు నిర్మించలేదని దుయ్యబట్టారు. ప్రజాబలంతో కాకుండా ధనబలంతోనే వైసీపీ గెలిచిందని హర్షకుమార్ ఆరోపించారు.

కాగా.. జ్యుడీషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై హర్షకుమార్‌‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోగా.. హర్షకుమార్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.