రాజమహేంద్రవరం: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కేసు పోలీసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగంపై వేటుపడుతుందోనన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే త్రిటౌన్ సీఐ ఎం.శేఖర్ బాబును సస్పెండ్ చేయడంతో ఇంకెవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన నెలకొంది పోలీసుల్లో. 

వివరాల్లోకి వెళ్తే విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తోయటం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ పై  త్రిటౌన్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. 

గత నెల 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ అక్కడకు వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుష పదజాలంతో దూషించినట్లు ఏవో సీతారామరాజు ఫిర్యాదు చేశారు. 

విధులు నిర్వహిస్తున్న కోర్టు ఉద్యోగులను బెదిరించేలా హర్షకుమార్ వ్యవహరించారని, ఉద్యోగులను నెట్టడం కూడా చేశారని అలాగే మహిళా ఉద్యోగినులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన త్రిటౌన్ పోలీసులు హర్షకుమార్ ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పటికే హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

హర్షకుమార్ ను పట్టుకునేందుకు నాలుగు బృందాలను నియమించింది పోలీస్ శాఖ. నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హర్షకుమార్ కు సహకరిస్తే వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ను అరెస్ట్ చేయడంలో అలసత్వం వహించారని నిర్థారిస్తూ త్రిటౌన్ సీఐ ఎం.శేఖర్ బాబును సస్పెండ్ చేశారు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్.

జీవీ హర్షకుమార్ ను అరెస్ట్ చేయాలని అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్ పాయ్ త్రిటౌన్ సీఐ శేఖర్ బాబు, సిబ్బందిని ఆదేశించారు. అయితే సీఐ, ఇతర పోలీసులు కల్లెదుటే హర్షకుమార్ తప్పించుకుపోవడంతో అర్బన్ ఎస్పీ షీమోషీబాజ్ పాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హర్షకుమార్ ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంతోపాటు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు శేఖర్ బాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. ఇకపోతే బోటు ప్రమాదంపై కూడా హర్షకుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేశారని తెలిపారు. 

ప్రమాదానికి గురైన బోటులో 93 మంది ప్రయాణిస్తున్నారని ఆరోపించారని అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చినా హర్షకుమార్ స్పందించలేదన్నారు. ఈ ఆరోపణలపై కూడా చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏఎస్ ఖాన్ హెచ్చరించారు. 

ఈనెల 28 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఇప్పటికీ ఆయన ఆచూకీ దొరకలేదు. మధ్యలో దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యక్షమై ఇట్టే మాయమయ్యారు. అయితే హర్షకుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు మాత్రం జల్లెడపడుతున్నారు.