Asianet News TeluguAsianet News Telugu

అమ్మవారితో ఆటలొద్దు .. పుట్టగతులుండవ్ : విపక్షాలకు వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరిక

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు . అమ్మవారితో ఆటలు అడ్డుకోవద్దు , అటువంటి వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు .  ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని మాట్లాడం సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. 

ex minister vellampalli srinivas fires on opposition parties ksp
Author
First Published Oct 17, 2023, 6:12 PM IST

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారితో ఆటలు అడ్డుకోవద్దు , అటువంటి వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఉత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని మాట్లాడం సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. మీడియాలో మాట్లాడి చర్చ చేయడం వారికి అలవాటుగా మారిందని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత ప్రభుత్వ హయంలో రాత్రికి రాత్రే గోశాలను తొలగించారని, వినాయకుడి గుడి పగుల గొట్టారని, వారు ఇప్పుడు నీతి వాఖ్యలు మాట్లాడటం శోచనియమన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా త్వరగా దర్శనం అయ్యేలా దేవాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారని వెల్లంపల్లి ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో దుర్గగుడి మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. 

కాగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజున శ్రీ కనకదుర్గా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. బాల త్రిపురా త్రిపుర త్రయలో మొదటి దేవత, శ్రీ యంత్రంలోని అన్నింటికి ప్రధాన దేవతగా హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.

ALso Read: విజ‌య‌వాడ దుర్గగుడి ద‌స‌రా ఉత్స‌వాలు: మునుపెన్నడూ లేని విధంగా భక్తుల రద్దీ

ఆలయ అర్చకులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 8.30 గంటల మధ్య సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్య అర్చన వంటి సంప్రదాయ ఆచారాలతో 9 రోజుల వేడుకలు ప్రారంభమయ్యాయి. అన్ని పూజలు పూర్తయిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి శ్రీబాలా త్రిపుర సుందరి దేవి దర్శనానికి భక్తులను అనుమతించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన జీవిత భాగస్వామితో కలిసి వేడుకలను ప్రారంభించారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.

జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఇఓ కెఎస్ రామారావు, ఎమ్మెల్యే వి శ్రీనివాసరావు తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దసరా వేడుక‌ల‌ మొదటి రోజున దుర్గా ఆలయాన్ని సందర్శించేందుకు రికార్డు స్థాయిలో యాత్రికులు వచ్చారు. ఇంత‌కుముందు ఎన్న‌డూలేని విధంగా పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చార‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios