ఎన్నికలు దగ్గరపడటంతో పార్టీ చేరికలు ఎక్కువైపోయాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ, వైసీపీల్లో చేరగా.. తాజాగా మాజీ మంత్రి కుమారుడు  వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ వచ్చే వారం వైసీపీలో చేరనున్నారు. పార్టీ అధినేత జగన్‌... కృష్ణప్రసాద్‌కు మైలవరం సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీలో చేరాలని యోచిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం తెలియగానే టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... కృష్ణప్రసాద్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తప్పనిసరిగా సీటు ఇస్తామంటూ సీఎం నచ్చజెప్పినట్లు తెలిసింది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నందున ఇప్పటికిప్పుడు సీటు విషయమై నిర్ణయం తీసుకోవటానికి వీలుపడదని, జిల్లా నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వ్యాపారాల వల్ల ఎప్పటి నుంచో వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జగన్‌ను కలిసారు.

తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. మైలవరం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్‌ సూచించారు. అయితే మైలవరం సీటును మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌, కాజా రాజ్‌కుమార్‌ ఆశిస్తున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ప్రజా సంకల్పయాత్ర వల్ల ఆశించిన మైలేజీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జగన్‌ మైలవరం సీటును కృష్ణప్రసాద్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

పోటీ చేయాలన్న జగన్‌ సూచనకు కృష్ణప్రసాద్‌ కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఈ వారంలో మంచి రోజు చూసుకుని జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. కృష్ణప్రసాద్‌ కూడా దీనిని ధ్రువీకరించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.