శ్రీశైలం జలాశయంలోకి వరద పోటెత్తుతున్నా, గేట్లెత్తేస్తున్నా పోతిరెడ్డిపాడుకు మాత్రం నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరమన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

బుధవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ రోజు 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు. అంటే రోజుకు 35 టీఎంసీలు శ్రీశైలంలో చేరుతుంటే మద్రాసుకు తాగునీటి కోసం తెలుగు గంగకు 9 టీఎంసీలిచ్చి ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కల్గిస్తోందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగు గంగ కింద 5.50 లక్షల ఆయకట్టు ఉందని, ఒకటిరెండు రోజుల్లోనే శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ నిండిపోతాయని చంద్రమోహన్ రెడ్డి ఆందోళన  వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి వరద సముద్రానికి వెళుతోందని..  ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని సోమిరెడ్డి మండిపడ్డారు.

కృష్ణా బోర్డుకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం, వెనుకబడిన రాయలసీమకు తాగు, సాగునీటి ఆవశ్యకతను వివరించడంలో విఫలమవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటు కృష్ణా, అటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలతో కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండించుకున్నా సంతోషమేనన్నారు. కానీ అతి భారీవర్షాలు కురిస్తే తప్ప రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మొదటి పంటకే నీళ్లు చాలని పరిస్థితి ఉందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దుర్భిక్షం, కరువుతో సతమతమవుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. వెంటనే పూర్తిస్థాయిలో పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయాలని చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.