ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాకముందే..  జంపింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు టీడీపీ, బీజేపీ నేతలు.. అధికార వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. మరో కీలక నేత పార్టీ ఫిరాయించారు. ఓ కీలక నేత  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ముందుగా కడప జిల్లాలో మరింత బలోపితం కావాలని.. ఆకర్ష మంత్ర మొదలుపెట్టింది. అధికార, విపక్ష పార్టీల్లో ఉండే అసంతృప్తులు, మాజీ మంత్రులను బీజేపీలోకి లాక్కునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే పలువురు మాజీలకు కాషాయ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

తాజాగా.. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం కుదర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే రాజంపేటలో జరిగే బహిరంగ సభలో సాయిప్రతాప్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. సునీల్ ధియోదర్, సోము‌ వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో సాయిప్రతాప్, అతని కుటుంబ సభ్యులు బీజేపీలో చేరనున్నారు. సాయి పార్టీలోకి వస్తే జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని కడప కమలనాథులు భావిస్తున్నారు. అయితే ఈ చేరికపై ఇంతవరకూ సాయిప్రతాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సాయిప్రతాప్ ఓ వెలుగు వెలిగారు. వైఎస్, సాయి ఇద్దరూ ప్రాణ స్నేహితులు కూడా. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయనకు 2019లో రాజంపేట ఎంపీ టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది. చివరికి ఆ టికెట్ సీనియర్ నేతను వరించింది. తర్వాత కాస్త రాజకీయాలకు దూరమైనట్లు కనిపించిన ఆయన.. తాజాగా.. బీజేపీలో చేరి.. తన ఉనిఖిని చాటుకున్నారు.