ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. జనసేనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు.  రావెల.. ఇటీవల జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఓ ప్రైవేటు సంస్థ ద్వారా.. రాష్ట్రంలోని జనసేన జనసేన అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రధానంగా కసరత్తు జరుగుతుందని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి దీనిని అడ్డుకోవాలని కోరారు. కుల వివక్షత, స్వార్ధపూరిత రాజకీయాలు, ఒంటెద్దుపోకడ నచ్చక తాను తెలుగుదేశం నుంచి వైదొలగినట్టు వెల్లడించారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తారన్న నమ్మకంతోనే  జనసేనలో చేరినట్టు చెప్పారు.
 
రాజకీయాల్లో అవినీతి పెరిగింది. ఇష్టానుసారం డబ్బు వెదజల్లి గెలవాలనుకుంటున్నారని కిషోర్‌బాబు ఆరోపణలు గుప్పించారు. కుల వివక్షత నేరుగా కాకుండా పరోక్షంగా కొనసాగుతుందని, ఇది కావాలని చేసే దుశ్చర్య మాత్రమేనని విమర్శించారు. జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌ తెల్లకాగితం వంటి వారని పొగడ్తలు గుప్పించారు. పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు.