తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా టిటిడి ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప. ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... శ్రీవారి దర్శనం చేసుకునే అన్యమతస్ధులు డిక్లరేషన్ పై సంతకం  చేయాల్సిన పనిలేదనడం టిటిడి నియామాల ఉల్లంఘనే అన్నారు.

వైవీ నిర్ణయం అన్యమతస్థులు ఎవరైనా తిరుమలకు , రావొచ్చన్నట్లుగా వుందని నిమ్మకాయల ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వుందన్నారు.ఏపీ రెవిన్యూ ఎండోమెంట్స్ జీవో ప్రకారం హిందువులు కాని వారు జీవో 311 రూల్ 16 ప్రకారం తప్పనా సరిగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తమ డిక్లరేషన్ ఇవ్వాలని నిమ్మకాయల గుర్తుచేశారు.

సంప్రదాయాలకు అనుగుణంగా గతంలో సోనియాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి నేతలు డిక్లరేషన్ లో సంతకాలు పెట్టి దర్శనం చేసుకున్నారని చినరాజప్ప తెలిపారు. మొన్న అన్యమత ప్రచారం, నిన్న నిధులు మళ్ళింపు, నేడు డిక్లరేషన్ ఎత్తివేయడం హిందూ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

టిటిడిలో వెంటనే డిక్లరేషన్ పునరుద్దరించాలని... లేని పక్షంలో ఆందోళన చేస్తామని నిమ్మకాయల హెచ్చరించారు. టిటిడీ ఛైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డీ తక్షణమే  రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై పాలకమండలి సభ్యులు కూడా తమ అభిప్రాయాలను బయటపెట్టాలని కోరారు. దేవాలయాలు అవిర్భావం నుంచి వున్న డిక్లరేషన్ సంప్రదాయం ఎవరికోసం ఎత్తేశారో చెప్పాలని నిమ్మకాయల కోరారు.

డిక్లరేషన్ ఎత్తేసి తిరుమలలో శ్రీవారి సంప్రదాయాలను మంటగలుపుతారా అని ఆయన నిలదీశారు. స్వామి దర్శనానీకి వెళ్ళే అన్యమతస్ధులకు డిక్లరేషన్ ఎత్తివేయడమంటే శ్రీవారిని అవమానించడమేనని చినరాజప్ప వ్యాఖ్యానించారు.

సిఎం జగన్ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయని నిమ్మకాయల ఆరోపించారు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుంటే కట్టడి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.