అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు మాజీమంత్రి నారా లోకేష్. 45ఏళ్లకే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు రూ.2000 పింఛన్ ఇస్తామని చెప్పిన జగన్ ఇచ్చిన మాట తప్పారంటూ విమర్శించారు. 

46 ఏళ్లకి వైయస్ జగన్ కి ఉద్యోగం వచ్చింది. 45 ఏళ్ల పెన్షన్ రత్నం మాయమయ్యిందంటూ సెటైర్లు వేశారు. పాదయాత్రలో గుర్తొచ్చిన ప్రజల కాళ్ల నొప్పులు మీరు కుర్చీ ఎక్కగానే మర్చిపోయారా? అంటూ నిలదీశారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ అన్న మీరు ఇప్పుడు పెనం మీద దోశ తిప్పినంత ఈజీగా మాట మార్చి వారిని మోసం చేశారని నారా లోకేష్ విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

జగన్ మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ సూచించిందని చెప్పుకొచ్చారు. 

అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి అంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పొందుపరిచారు. మనం ప్రజాస్వామ్య పాలనలో  ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి నారా లోకేష్. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదీ... సస్పెన్షన్ పై లోకేష్ కౌంటర్లు