ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడులపై సస్పెన్షన్ విధించారు. కాగా.. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు.

ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ వారెవా.. ప్రజల పక్షాన నిలిస్తే.. రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ..’’ అని లోకేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ కామెంట్ కి మార్షల్స్ నిమ్మల రామా నాయుడుని ఎత్తుకెళ్లి బయట వదిలిపెడుతున్న ఫోటోలను కూడా జత చేశారు. కాగా... ఈ పోస్టుకి టీడీపీ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఇదిలా ఉంటే... తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ని కోరారు. కాగా... అధికార పక్షం కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేయాలనే భావిస్తున్నట్లు సమాచారం. తాము ఎలాంటి తప్పు చేయకుండానే తమను సస్పెండ్ చేశారని మరో వైపు టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.., దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.