అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి నారా లోకేష్. సీఎం వైయస్ జగన్ నామ మాత్రపు ముఖ్యమంత్రా అంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ప్రస్తావిస్తూ జగన్ పై విరుచుకుపడ్డారు. 

బడ్జెట్‌లో కేటాయింపులు, హామీలు నామమాత్రంగానే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్ చూస్తుంటే జగన్ కూడా నామమాత్రపు ముఖ్యమంత్రిలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. శాసన సభలో సున్నా వడ్డీ రుణాలు పథకంపై నానా హంగామా చేసిన జగన్ ఆ పథకానికి రూ. 3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదో చెప్పాలని ప్రశ్నించారు. 

సొంత జిల్లాలో తండ్రి వైఎస్ పేరుతో రైతు దినోత్సవం జరిపిన జగన్ తీరా బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించడం ఏంటోనని నిలదీశారు. ప్రభుత్వ పథకాలకు తమ పేరు పెట్టుకుని మురిసిపోతున్నారంటూ మండిపడ్డారు. 

అమ్మఒడి పథకంతో లబ్దిపొందే తల్లుల సంఖ్య తగ్గించడమేంటని లోకేష్ ప్రశ్నించారు. ఒక తల్లికి ఇచ్చి ఇంకొ తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? అంటూ విమర్శించారు. ఆ పథకానికి కూడా జగనన్న జంపింగ్ జపాంగ్ అని పేరుపెడితే బాగుండేదని సెటైర్లు వేశారు.
 
వైద్య ఖర్చులు రూ. వెయ్యి దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ మైకుల ముందు ఊదరగొట్టి ఇప్పుడు బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి రూ. 1740 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. 

జగన్ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకు తీసిన చందంగా ఉందంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామని, గృహ రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ. 8,615కోట్లు మాత్రమే కేటాయించడంపై సందేహం వ్యక్తం చేశారు. జగన్ నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్లు కాదు కదా? అంటూ నారా లోకేష్ విమర్శల దాడి ఎక్కుపెట్టారు.