ఏపీ కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏదో ఒక స్పష్టత లభించనుంది.
మంత్రి వర్గ పునర్వ్యస్ధీకరణ (ap cabinet reshuffle) సందర్భంగా తనకు రెండోసారి అవకాశం దక్కకపోవడం పట్ల మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత (mekathoti sucharitha) అలకబూనిన సంగతి తెలిసిందే. తీవ్ర అసంతృప్తితో ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా చేస్తున్నట్లు. ఈ క్రమంలో ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా బుధవారం సుచరిత తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో (ys jagan) ఆమె భేటీ అయ్యారు.
ఇకపోతే.. ఏపీ కొత్త మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న సుచరిత నిన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే వైసీపీలోనే (ysrcp) కొనసాగుతానని స్పష్టం చేశారు. క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయవద్దని .. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని సుచరిత విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటికే ఆమెకు మద్దతుగా కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. రెండేన్నరేళ్లు మాత్రమే మంత్రి పదవి అని సీఎం జగన్ ముందే చెప్పారని సుచరిత అన్నారు. మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని... కానీ కొన్ని కారణాలు బాధ కలిగించాయన్నారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని సుచరిత తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
ఇక, తన తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా సుచరిత కూతురు ఆదివారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజీనామా చేయలేదని ఆమె వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖపై సంతకం చేసి వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావుకు అందజేసినట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తికి లోనైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథిలు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
