ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ కాక పెంచుతున్నాయి.  మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుపట్టి కూర్చుంటే... అమరావతిని రాజధాని నుంచి తరలించవద్దంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో ముందుగానే టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టులు చేశారు.

రాజధాని గ్రామాల్లోనూ ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. కుప్పలుకుప్పలగా అమరావతి ప్రాంత గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.... దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదిగా మండిపడ్డారు. పాకిస్తాన్ బోర్డర్ ని తలపించేలా పోలీసులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.

Also Read హైపవర్ కమిటీ నివేదికకకు ఏపీ కేబినెట్ ఆమోదం...

‘‘ఇంటికి పది మంది పోలీసులా? ఇళ్ల ముందు నెట్లు పట్టుకొని నిలబడటం ఏంటి? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు? పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా రాజధాని గ్రామాల్లో పోలీసులను దింపుతారా? ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అడగటం ప్రజలు చేసిన తప్పా?’’ అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో ‘‘అడుగుకో పోలీసు, లాఠీలు, ముళ్ల కంచెలతో రాజధానిని తరలించాలి అనే పట్టుదల ఎందుకు? రాజధాని విభజన నిర్ణయంలో పసలేదు కాబట్టే వైకాపా ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది.’’ అని పేర్కొన్నారు.