నివేశన స్థలాల పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఆదివారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల ప్రోద్భలంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైతుల్ని మోసగించి వేల కోట్లు సీఎంకు దోచిపెట్టారని ఎద్దేవా చేశారు.

భూముల కొనుగోలుకు 4 వేల కోట్లు, మట్టి పూడ్చడానికి 2,500 కోట్లు ప్రభుత్వ ఖజానాను కాజేసారని రవీంద్ర ధ్వజమెత్తారు. ఎకరం రూ.5 లక్షలు విలువ చేసే భూమిని రూ.30, 40లక్షలకు కొనుగోలు చేసారని కొల్లు ఆరోపించారు.

నివాసయోగం లేని భూములను పేదలకు కొనిచ్చారని.. తణుకు వైసీపీ ఎమ్మెల్యే అవినీతి చిట్టాను వారి పార్టీ నేతలే సీఎంకు లేఖ ద్వారా తెలియచేశారని రవీంద్ర గుర్తుచేశారు. మచిలీపట్నంలో అధికారులు కూడా నివేశన స్థలాల కొనుగోలులో వాటాలు పంచుకున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

చిన్న చిన్న సమస్యలను చూపి రైతుల నుండి దండుకున్నారని.. దోచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని రవీంద్ర వ్యాఖ్యానించారు. రాడార్ కేంద్రం వద్ద వ్యవసాయ క్షేత్రం భూమి ప్రభుత్వ భూమి అని ఆ భూమిని మెడికల్ కాలేజీకి తీసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా దాని పక్కనున్న 40 ఎకరాల పట్టా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రవీంద్ర ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్ భూములను లాక్కుంటున్నారని.. ఎన్నికల ముందు G+3 గృహాలను పూర్తి ఉచితంగా ఇస్తామన్న జగన్ నేడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

కాలు చాపుకోవడానికి కూడా సరిపోని విధంగా పేదలకు నివేశన స్థలాలు ఇస్తున్నారని.. సెంటు భూమిలో ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుందో ప్రభుత్వమే చెప్పాలని రవీంద్ర ప్రశ్నించారు.  

పట్టణ ప్రాంతాలలో సెంటున్నర నుండి 2 సెంట్లు భూమి, గ్రామాలలో 3 నుండి 5  సెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ కాలనీల పేరుతో దోచుకున్నారని.. నేడు జగన్ రెండింతలు దోపిడీ చేస్తున్నారని రవీంద్ర ఆరోపించారు.

మచిలీపట్నం టౌన్ లో ఉంటున్న వారందరికీ రూరల్ లో నివేశన స్థలాలు ఇస్తున్నారని.. రూరల్ లో సెంటున్నర ఇస్తున్నప్పుడు టౌన్ లబ్దిదారులందరినీ రూరల్ లోకి తీసుకువెళ్లి సెంటు భూమే ఇస్తామనడం ఎంత వరకు న్యాయమో అధికారులే చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు.