ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని.
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంతో పాటు టీడీపీ నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభతో కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడారని, 14 ఏళ్ల పాటు సీఎంగా వున్నప్పుడు గుడివాడ అభివృద్ధి కోసం చంద్రబాబు ఏం చేశారని నాని ప్రశ్నించారు. వైఎస్, జగన్ హయాంలో పేదల ఇళ్ల కోసం గుడివాడలో 375 ఎకరాలు కొనుగోలు చేశారని, టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా చేయలేదని నాని దుయ్యబట్టారు. మంచి నీటి సరఫరా కోసం 216 ఎకరాల్లో చెరువులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఒక్క ఎకరా సేకరించానని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. తాను గుడివాడ ముద్ధుబిడ్డనని, టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్కంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎందుకు తొలగించారు.. చంద్రబాబు మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట్రుక ముక్క కూడా పీకలేరని, చంద్రబాబు ఉడుత ఊపులకు భయపడనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు మోసగాడని, గెలవడం కోసం పవన్ కాళ్లు పట్టుకుని, బూట్లు నాకుతున్నారంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శత్రువుకు కూడా లోకేష్ కొడుకు వుండకూడదని ఆయన పేర్కొన్నారు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అంటూ నాని ప్రశ్నించారు.
అంతకుముందు కొడాలి నానిపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . కొడాలి నానిది నోరా డ్రైనేజా.. ఎంత ఫినాయిలే వేసి కడిగినా అతని నోరు మురికి కాలువేనంటూ వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే ఆయన బూతులు మాట్లాడుతుంటాడని, ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తన వద్దే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని, తనకే పాఠాలు చెబుతారా అంటూ నానిపై ఫైర్ అయ్యారు.
టీడీపీ జనసేనలు కలిశాయని తెలియగానే వైసీపీ నేతల్లో దడ మొదలైందని, ఏ సర్వే చూసినా తమ కూటమిదే విజయమని చెబుతున్నాయని చంద్రబాబు తెలిపారు. అందుకే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, రాజకీయాల్లో తాను ఎక్కడా ట్రాన్స్‌ఫర్లు చూడలేదన్నారు. ఇక్కడి చెత్తను అక్కడికి, అక్కడి చెత్తను ఇక్కడికి మార్చుతున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వానికి మరో 83 రోజులే సమయం వుందని ఆయన జోస్యం చెప్పారు. బ్రిటీష్ వారి మాదిరిగానే జగన్ కూడా వ్యాపార సంస్థలు పెట్టి సంపదనంతా దోచేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.
