మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు. బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయిన డీఎల్... టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు.

కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు డీఎల్ రవీంద్రారెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు డీఎల్.. కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికారు. అప్పుడే టీడీపీలో చేరదామని ఆయన ప్రయత్నించారు. అయితే.. మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో సుధాకర్  యాదవ్ అడ్డుగా రావడంతో  డీఎల్ చేరిక నిలిచిపోయిందని అప్పట్లో ప్రచారం సాగింది.

తాజాగా డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడ సాగింది. డీఎల్ రవీంద్రారెడ్డిని వైసీపీలో చేర్చుకొన్న తనకు అభ్యంతరం లేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడ వైసీపీ చీఫ్ జగన్‌కు తేల్చి చెప్పారు.

అయితే మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టును డీఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చేందుకు జగన్ నిరాసక్తతను వ్యక్తం చేశారు. డీఎల్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చేందుకు జగన్ ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని డీఎల్ అనుచరులకు వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. మైదుకూరు నుండి  వైసీపీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో  రఘురామిరెడ్డే బరిలో దిగుతారని జగన్ ఇటీవల ప్రకటించారు. కావాలంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ చెప్పారు.ఈ ఆఫర్ నచ్చని డీఎల్.. బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యి.. టీడీపీలో చేరికను కన్ ఫామ్ చేసుకున్నారు. 

read more news

జగన్ షాక్: డీఎల్‌ చూపు ఎటు వైపు