కడప: కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు డీఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. ఎమ్మెల్సీ  ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా స్పందించింది. అయితే ఈ తరుణంలో తనను గౌరవించే పార్టీలో చేరుతానని డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించడం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరు దపాలు  డీఎల్ రవీంద్రారెడ్డి విజయం సాధించారు.2014 ఎన్నికలకు ముందు  డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

అదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు విషయంలో సుధాకర్  యాదవ్ అడ్డుగా రావడంతో  డీఎల్ చేరిక నిలిచిపోయిందని అప్పట్లో ప్రచారం సాగింది.

తాజాగా డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడ సాగింది. డీఎల్ రవీంద్రారెడ్డిని వైసీపీలో చేర్చుకొన్న తనకు అభ్యంతరం లేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడ వైసీపీ చీఫ్ జగన్‌కు తేల్చి చెప్పారు.

అయితే మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టును డీఎల్ రవీంద్రారెడ్డికి ఇచ్చేందుకు జగన్ నిరాసక్తతను వ్యక్తం చేశారు. డీఎల్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చేందుకు జగన్ ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని డీఎల్ అనుచరులకు వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పింది.

మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టును డీఎల్‌కు ఇస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని డీఎల్ అనుచరులు వైసీపీ నాయకత్వం వద్ద ప్రతిపాదించారు. అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రమే వైసీపీ సానుకూలంగా స్పందించింది.

మైదుకూరు నుండి  వైసీపీ అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో  రఘురామిరెడ్డే బరిలో దిగుతారని జగన్ ఆదివారం నాడు ప్రకటించారు. డీఎల్ పార్టీలో చేరినా తనకు అభ్యంతరం లేదని  రఘురామిరెడ్డి జగన్ వద్ద ప్రస్తావించారు. కానీ, రఘురామిరెడ్డికే టిక్కెట్టు అంటూ జగన్ తేల్చేశారు.

ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ ప్రతిపాదించడంపై డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్న తనను గౌరవించే పార్టీలో చేరుతానని డీఎల్ చెబుతున్నారు.

గతంలోనే డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం  సాగింది. చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటన సమయంలో డీఎల్ రవీంద్రారెడ్డి  బాబుతో  సమావేశమయ్యారు. అయితే  డీఎల్ ను టీడీపీలో చేర్చుకొనేందుకు వీలుగానే సుధాకర్ యాదవ్ కు టీటీడీ చైర్మెన్ పదవిని ఇచ్చారనే ప్రచారం కూడ టీడీపీలో ఉంది. వైసీపీ నుండి సరైన స్పందన లేకపోవడంతో డీఎల్ ఏ పార్టీ వైపు  చూస్తారనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.