రైతులకు రావాల్సిన కౌలు డబ్బులు ఇవ్వమని అడిగితే మహిళలని కూడా చూడకుండా వారిపై పోలీసులతో దాడి చేయించారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా.

విజయవాడ సింగ్ నగర్ స్టేషన్ లో ఉన్న అమరావతి రైతులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడిలో చాలామంది మహిళలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రైతులు చేసిన తప్పేంటని ఉమా నిలదీశారు.

Also Read:సీఆర్డీఎ ముట్టడి: ఉద్రిక్తత, రాజధాని రైతుల అరెస్టు (వీడియో)

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఇదొక నిదర్శనమన్నారు. మూడు రాజధానుల అంశం హైకోర్టులో ఉండగా మేము జోక్యం చేసుకోలేమంటూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వడమేనా రైతులు చేసిన నేరమా అని దేవినేని నిలదీశారు. రైతులకు చెల్లించాల్సిన కౌలు సీఆర్డీఏ కు వచ్చినా ఎందుకని రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోతున్నారని ఆయన  ప్రశ్నించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి తప్పక ఫలితం అనుభవిస్తారని ఉమా జోస్యం చెప్పారు.