వైసీపీని వీడేది లేదు .. అన్ని విషయాలు జగన్‌కు చెప్పా , తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను : బాలినేని
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని .. పార్టీ మారే ఉద్దేశ్యం వుంటే జగన్ దగ్గరికి రాననని పేర్కొన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి . తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను జగన్ దృష్టికి తీసుకెళ్లానని.. ఆయనకు అన్ని విషయాలు తెలుసునని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని .. పార్టీ మారే ఉద్దేశ్యం వుంటే జగన్ దగ్గరికి రాననని పేర్కొన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ముఖ్యమంత్రి వివరించానని చెప్పారు. నాలుగైదు రోజుల్లో నిధులు విడుదలకు సంబంధించి క్లియరెన్స్ ఇస్తానన్నారని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వచ్చి ఇలా పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పినట్లు శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
జగన్‌ను కలిసేందుకు తనకు అపాయింట్‌మెంట్ అవసరం లేదని.. ఎప్పడైనా రావొచ్చని సీఎం కూడా చెప్పారని ఆయన వెల్లడించారు. మీడియా ముసుగులో తనను ఎవరైనా అంటే సహించనని బాలినేని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను జగన్ దృష్టికి తీసుకెళ్లానని.. ఆయనకు అన్ని విషయాలు తెలుసునని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒంగోలు నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేయమని కోరింది తానేనని మాజీ మంత్రి వెల్లడించారు.
జిల్లా ఎస్పీకీ, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన లీకులు ఇస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని బాలినేని పేర్కొన్నారు. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని .. తాను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు వచ్చినా ఊరుకోనని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో వివాదాలు లేవని.. జిల్లాలో ఉన్న రాజకీయ ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని ఆయన తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా వాటి గురించి చెప్పలేదని .. సిట్ విచారణ సంతృప్తికరంగా సాగుతుందని బాలినేని స్పష్టం చేశారు.