బాలినేని వర్సెస్ అధిష్టానం : ఫేక్ డాక్యుమెంట్స్ స్కాంపై సీఎంవోలో రెండోరోజు పంచాయితీ.. ఏం తేల్చారంటే...
ప్రకాశం వైసీపీలో భూ ప్రకంపనలు చర్చనీయాంశంగా మారాయి. ఫేక్ డాక్యుమెంట్లతో భూ కుంభకోణం జరిగిందన్న అంశం ఇప్పుడు ఎటు మలుపు తిరగబోతోందో అనే చర్చ నడుస్తోంది.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇబ్బందులు మొదలయ్యాయి. ఒంగోలులో ఈమధ్య వెలుగు చూసిన నకిలీ పత్రాల కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. దీంతో ఈ వ్యవహారం తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీంట్లో భాగంగానే గురువారం మాజీ మంత్రి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు.
ఇక ధనుంజయ రెడ్డి మౌఖిక ఆదేశాలతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గార్లు కూడా తాడేపల్లికి చేరుకున్నారు. సీఎమ్ఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులుతో వీరిద్దరు భేటీ అయ్యారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరిగాయి. అంతకు ముందే బాలినేని, ధనుంజయ రెడ్డితో భేటీ అయ్యారు.
ఐబీ సిలబస్.. విద్యార్థులందరికీ నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందిస్తాం.. : బొత్స సత్యనారాయణ
బాలినేని మాట్లాడుతూ..ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు ఈ కేసును తేల్చాలని తాను ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఆరోపించారు. వారికి గట్టిగా చెప్పాలని ధనుంజయ రెడ్డిని కోరారు. దీంతోనే అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్డులను శుక్రవారం పిలిపించారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి.. బాలినేని సమక్షంలోనే వారితో మాట్లాడారు.
ఆ సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముందు నిందితుల పేర్లు బయటపెట్టి.. ఆ తర్వాత దర్యాప్తు కొనసాగించమని కోరారు. కేసు దర్యాప్తు తర్వాతే నిందితుల వివరాలు తెలుస్తాయని.. ఆ తర్వాతే బయట పెట్టడం, నిందితులను అరెస్టు చేయడం పద్ధతి అని ఎస్పీ తెలిపినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేలా ప్రతిపక్షాలకు లీకులు ఇస్తున్నారని బాలినేని ఆరోపించారు. ఈ మీటింగ్ ల తర్వాత బాలినేని ఆఫీసు నుంచి సీఎంవోలో జరిగిన పంచాయతీ మీద ఓ ప్రకటన విడుదల అయ్యింది.
‘ఒంగోలులో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ పత్రాల కేసులో సిఐడి సహకారంతో నిగ్గు తేలుస్తాం. ఈ స్కామ్ లో ఎంతటి వాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదు. సిఐడి సహకారంతో ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని అదనపు కార్యదర్శి ఆదేశించారు. దీంతో ప్రభుత్వానికి నేను సరెండర్ చేసిన భద్రత సిబ్బందిని తిరిగి తీసుకుంటున్నా’ అని అందులో చెప్పుకొచ్చారు.
అసలేం జరిగిందంటే.. ఒంగోలులో ఓ భూ కుంభకోణంలో నకిలీ దస్తావేజులు పత్రాలను ఉపయోగించారు. ఈ కుంభకోణంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, అతడి అనుచరులే సూత్రధారులని ప్రతిపక్షాలు విమర్శలు గుర్తించడం మొదలుపెట్టాయి. దీంతో, బాలినేని వెంటనే స్పందించారు. ఈ కుంభకోణంలో ఎవరున్నా వెంటనే శిక్షించాలని, చివరికి అధికారపక్షం వాళ్ళ హస్తం ఉన్నా శిక్షించాలని కోరారు. నకిలీ పత్రాల కుంభకోణం కేసులో ఏర్పాటైన సిట్… అసలైన వారిని పట్టుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతోపాటు తన ప్రత్యేక భద్రతను, గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు.