విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆనం రామనారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వైఎస్ జగన్ ఆనంకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆనంతో పాటు ఆయన అనుచరులు సైతం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నేత వివేకానందరెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరారు. టీడీపీలో   రామనారాయణరెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆత్మకూరు ఇన్‌చార్జిగా నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే టీడీపీలో తగిన గుర్తింపు దక్కడం లేదన్న భావనతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

అంతేకాదు టీడీపీ మినీ మహానాడు వేదికపై నుంచి ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని విమర్శించారు. దీంతో ఆనం పార్టీ మారతారని అంతా ఊహించారు. గత మూడు నెలలుగా వైసీపీనేతలతో మంతనాలు జరిపిన ఆనం కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రకటించారు.  

ఆనం చేరికతో నెల్లూరు వైసీపీలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఆనం ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఎమ్మెల్యేకు పోటీ చెయ్యమంటారా...లేక ఎంపీగా పోటీ చెయ్యమంటారా అన్నది జగన్ ఇష్టం అని ఇప్పటికే ఆనం ప్రకటించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.