కడప: ఏపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి. మంత్రులు వాడుతున్న భాషపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్న మంత్రులు తమ స్థాయి మరచిపోయి చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. 

మంత్రులు వాడుతున్న భాషను విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. మంత్రుల పదజాలం వినలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి దుర్భాషలాడతారా అంటూ విరుచుకుపడ్డారు. 

వైయస్ఆర్ కడప జిల్లా కార్యకర్తలతో సమావేశమైన అమర్నాథ్ రెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అధికారంలో లేమని కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులను ప్రతీ కార్యకర్త ఎదుర్కోవాలని సూచించారు. 

కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు త్వరలోనే జిల్లాలో పర్యటించబోతున్నట్లు తెలిపారు. ఇకపోతే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి రాగానే కొంపలు ముంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. 

రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని నిలదీశారు. 
ప్రభుత్వ వైఖరితో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.  

అతి తక్కువ సమయంలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. వరదలు లేని చోట ఎందుకు ఇసుక కొరత ఉందో చెప్పాలని నిలదీశారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారనడాని ప్రభుత్వ వ్యతిరేక విధానాలే కారణమని ఆరోపించారు. 

రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలోపేతం కావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు. పార్టీని సంస్థాగతంగా, గ్రామ స్థాయిలో బలోపేతం చేసే దిశగా అడగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అధికారంలో ఊన్నా లేకున్నా కార్యకర్తల్ల మనో ధైర్యాన్ని నింపుతామని వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు శ్రీనివాసులరెడ్డి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 25, 26, 27న మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

Video news : పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

చింతమనేనిని ఆదర్శమా ?. చంద్రబాబుకు సిగ్గుందా!: వైసీపీ ఎమ్మెల్యే