వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నేత , మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వీరిద్దరి భేటీపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా ఆదివారం జమ్మలమడుగులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్- మోడీ, పవన్ కళ్యాణ్ - చంద్రబాబుల భేటీ జరిగిందన్నారు. 

ఇక వివేకా హత్య కేసుపై ఆయన స్పందిస్తూ.. వివేకా హత్య, కోడికత్తి సంఘటనల్లో వాస్తవాలు బయటకి రావడంతో అసలు నిందితులు ఎవరో అందరికీ తెలిసిందన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని.. ఆయన వల్ల వైఎస్ బ్రాండ్ పూర్తిగా చెడిపోయిందని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. ఇదే విషయాన్ని వైఎస్ కుటుంబ సభ్యులే చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతాని ఆదినారాయణ రెడ్డి వివరించారు. 

ALso Read: చంద్రబాబు, పవన్ భేటీపై నేనెందుకు స్పందించాలి: బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి

మరోవైపు.. పవన్ కల్యాణ్ శనివారం రోజున హైదరాబాద్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం సాగింది. గత కొద్ది నెలల కాలంలో ఇరువురు నేతలు భేటీ కావడం ఇది మూడోసారి. అయితే ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్.. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేంద్ర మంత్రి వి మురళీధరన్‌లతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. 

అయితే ఈ పరిణామం చోటుచేసుకున్న మూడు వారాల తర్వాత పవన్ నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇరువురు నేతలు కూడా.. ఏపీలో అధికార వైసీపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అలాగే రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించిన అంశాలపై చర్చలు సాగినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని పలు సందర్భాల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో జగన్‌ను ఎదుర్కొవాలంటే.. బీజేపీ మద్దతు అవసరం అని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.