తాను టీడీపీలోనే కొనసాగుతానని ఎప్పుడూ చెప్పలేదని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తనకు తన ప్రాంత అభివృద్ధి మాత్రమే ముఖ్యమని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను చంద్రబాబుతో భేటీ అయినమాట నిజమేనని... అలా అని తాను టీడీపీలోనే ఉంటానని కాదని పేర్కొన్నారు.

‘‘బీజేపీలో చేరడం ఖాయం. అనుచరులతో సమావేశమై తేదీ నిర్ణయించడమే మిగిలింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి చంద్రబాబును కలిసి మాట్లాడింది నిజమే. మా వాళ్లతో మాట్లాడి చెపుతానని ఆయనకు స్పష్టంగా చెప్పాను. పార్టీలో కొనసాగుతానని టీడీపీ వర్గాలు చెప్పడం సరికాదు’’ అని ఆయన పేర్కొన్నారు.

తనకు దేశభక్తి ఎక్కువనీ, తన ప్రాంతం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదని, అందుకనే తాను ఓడిపోయానని వివరించారు.

సంబంధిత వార్తలు..

పీఛే ముడ్: ఆదినారాయణ రెడ్డి వెనక్కి, టీడీపిలోనే.

బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?