కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

తెలుగు రాష్ట్రాల బీజేపీ వ్యవహారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తప్పించిన హైకమాండ్.. ఆ పదవిలో మాజీ కేంద్ర మంత్రి , ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయగా.. ఆ వెంటనే కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది.

మరోవైపు తనకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదంటూ అలకబూనిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం కీలక బాధ్యతలను కట్టబెట్టింది అధిష్టానం. తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే.. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది.