విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంతో పాటు అధిక సంఖ్యలో ఆస్పత్రిపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన చెందారు. ఈ ఘటనలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా మృతిచెందాయని ఆయన తెలిపారు. 

కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలని ఆయన సూచించారు. ఈ విష వాయువు సుమారు 3కిలోమీటర్లు వ్యాప్తి చెందడంతో చెట్లన్నీ రంగుమారడం జరిగిందని, అది విషవాయు తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు.

 యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని, బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

కాగా.. ఈ ఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కూడా స్పందించారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై లోకేష్ విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడి రసాయనాలు పీల్చుకుని అస్వస్థతకు గురై పలువురు మృతి చెందటం పట్ల దిగ్భ్రాంతికి గురయ్యారు.

 చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు లోకేష్ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీశ్రేణులకు లోకేష్ పిలుపునిచ్చారు.