జగన్ పాలన మీద ప్రజలు విసిగెత్తిపోయారని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ బీజేపీ భవిష్యత్తు చాలా బాగుంటుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది నరేంద్రమోడీ కల అని అందుకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు.

ఈ విషయంలో ఏపీలో ఉన్న గత ప్రభుత్వం బాగా చొరవ చూపిందని.. కేంద్రం 7 లక్షల పైగా ఇళ్లను ఏపీకి కేటాయించిందని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇళ్ల నిర్మాణం ఆపేశారని, టెండర్లు రద్దు చేశారని ఆయన ఆరోపించారు. విశాఖలో గతంలో వచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయడం దారుణమని విష్ణుకుమార్ రాజు  ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చి రాగానే ప్రజా వేదికను కూల్చివేశారని మండిపడ్డారు. కూల్చడంలో సీఎం జగన్ అద్భుతమైన ప్రతిభ చూపారని ఇది రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వమంటూ విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం చర్యతో కాంట్రాక్టర్లు సర్వనాశనం అయిపోయారని.. వైసీపీ సర్కారు అనాలోచిత చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలని హితవు పలికారు.

రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి లాభం లేదని.. ప్రధాని మోడీని జగన్ కలవడంలో తప్పు లేదని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఎన్‌డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందని తాను భావించడం లేదని ఏపీలో ఉన్న మందు బ్రాండ్లు మరెక్కడా కనబడవని ఆయన మండిపడ్డారు.