ఏపీలో కరువు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ ఏది ? - టీడీపీ నేత అచ్చెన్నాయుడు
ఏపీలో కరువు తాండవిస్తోందని, కానీ ఈ విషయంలో ఏపీ కేబినేట్ సమావేశంలో కనీస చర్చ జరగలేదని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో కరువుకు, రైతులు, రైతు కూలీల వసలకు సీఎం జగన్ పరిపాలనే కారణమని ఆయన విమర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం కేబినేట్ సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. అయితే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగలేదని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం, కరువు తాండవిస్తున్నా కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని దోచుకోవడం, టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదు చేసేందుకే సీఎం జగన్ మోహన్ జగన్ రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కరువు మండలాల ప్రకటనలోనూ రైతులను సీఎం మోసం చేశారని అన్నారు. ఏపీలో లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో కేబినెట్ భేటీలో కనీస చర్చ జరగలేదని తెలిపారు.
ఏపీలో 70 శాతం మంది వ్యవసాయం రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అయితే ఈ రంగంపై సీఎం ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందని అన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కరువుతో ప్రజలు వలసబాట పడుతున్నారని, ఇది సీఎంకు కనిపించడం లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినేట్ లో చర్చిందుకు కూడా తీరక లేదా అని అన్నారు.
Fire accident : డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..17 మందికి గాయాలు..
శుక్రవారం జరిగిన కేబినేట్ మీటింగ్ లో వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ఠ్రంలో కరువు తీవ్రంగా ఉందని, అయితే సీఎం జగన్ 103 కరువు మండలాలను మాత్రమే ప్రకటించి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజలు కరువులో కూరుకుపోవడానికి, రైతులు, రైతు కూలీలు వలస వెళ్లడానికి సీఎం జగన్ దోపిడీ పాలనే కారణమని ఆయన విమర్శించారు.