పరకాల ప్రభాకర్ రాజీనామా లేఖ పూర్తి పాఠం

First Published 19, Jun 2018, 4:50 PM IST
Essence of Parakala Prabhakar's resignation letter
Highlights

ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ పరకాల ప్రభాకర్ ఓ లేఖ రాశారు.

అమరావతి: ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ పరకాల ప్రభాకర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖ రాజకీయంగా కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ ఆయన ఆ లేఖ రాశారు. చంద్రబాబును ఉద్దేశించి ఆ లేఖ రాశారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇదీ..

"విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండడాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని.. మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించి వాటిని తెరవెనుక మంతనాలకు, బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణం. నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది.
 
పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం. నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్ష మీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక. నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరకూడదని నా దృఢ అభిప్రాయం. అందువల్ల నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. మీ మీదా, ప్రభుత్వం మీదా బురద జల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికి నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు. నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను."

loader