Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారితే...రేపు చంద్రబాబు, లోకేష్ జైలుకే: జోగి రమేష్

రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే, అక్రమాలకు చెక్ పెడితే హర్షించకపోగా.. గత ప్రభుత్వం చేసిన అవినీతికి, అక్రమాలకు చెక్ పెట్టామని తెలుగు దొంగల బ్యాచ్‌ గగ్గోలు పెట్టడం ఏంటని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. 

ysrcp mla jogi ramesh sensational comments on chandrababu, lokesh
Author
Amaravathi, First Published Jun 25, 2020, 6:39 PM IST

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తే, అక్రమాలకు చెక్ పెడితే హర్షించకపోగా.. గత ప్రభుత్వం చేసిన అవినీతికి, అక్రమాలకు చెక్ పెట్టామని తెలుగు దొంగల బ్యాచ్‌ గగ్గోలు పెట్టడం ఏంటని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు.  అక్రమాలు చేస్తున్న ఓ వేదికకు చెక్ పెట్టడం జరిగిందన్నారు. ప్రజావేదిక కూల్చివేసి సంవత్సరమైంది సంతాపసభ పెడతామని ఎల్లోగ్యాంగ్ వెళ్లటం ఏందని జోగి రమేష్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిపోయిందని ఎల్లో గ్యాంగ్‌, పచ్చ గ్యాంగ్‌ అక్కడకు వెళ్లి సంతాపసభ పెడతామని వెళ్లారని రమేష్ ప్రశ్నించారు. 

ఈరోజు అవినీతి పరిపాలన అంతమై ఏడాది అయిన సందర్భంగా సంతాపసభ పెట్టడానికి వెళ్లారా? మీ అక్రమాలకు చరమగీతం పాడి ఏడాదైన సందర్భంగా సంతాపసభ పెట్టడానికి వెళ్లారా? ఒక అక్రమ కట్టడంలో కూర్చొని మీరు చేసిన అవినీతిని అంతం చేసినందుకు అక్కడ సంతాపసభ పెట్టడానికి వెళ్లారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఈ ఎల్లో గ్యాంగ్ అంతా ఎల్లో మీడియాలో కనిపించాలనే ఉత్సాహం, ఆత్రుత తప్ప రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఏమైనా ఉందా అని రమేష్‌ నిలదీశారు. 

చంద్రబాబు ట్విట్టర్‌లో విధ్వంసానికి ఓ ఏడాది అని పోస్ట్ పెట్టారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలకు  చెక్‌ పెట్టి ఏడాది అయిందని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇచ్చారని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. 

''ఒక్క ఏడాదిలో 3.92 కోట్ల మందికి అభివృద్ధి ఫలాలు అందించారు. పేదల బ్యాంకు ఖాతాల్లోకి రూ.43 వేల కోట్లు పంపిస్తే ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి, దేనికి విధ్వంసానికి ఏడాదని ఎందుకు పోస్ట్ చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలి'' అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అవినీతి, అక్రమాలకు, అరాచకాలు, దోపిడీకి, వెన్నుపోటు రాజకీయానికి చెక్ పెట్టి సంవత్సరం అయిందా అని జోగి రమేష్ మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా సంతోషంగా ఉన్నారని రమేష్ అన్నారు. కరోనాతో ప్రపంచం అల్లాడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్‌ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. ఉదయం నుంచి ఎల్లో గ్యాంగ్ రంకెలు వేస్తున్నారని జోగి మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చి విధ్వంసం అంటున్నారని...అసలు ప్రజావేదిక దగ్గర ఏం జరిగిపోయిందని సంతాపం తెలియజేస్తారని జోగి రమేష్ ప్రశ్నించారు. 

ఆందోళన చేయటానికి, నిరసన చెప్పటానికి ఓ కారణమైనా ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయి...  అయితే ఈరోజున ప్రతిపక్షానికి ఆ ఆందోళన చేసే అవకాశం కూడా సీఎం ఇవ్వలేదని జోగి తెలిపారు. 30 లక్షల మంది నిరుపేదలైన అక్కచెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు.అలాగే అమ్మ ఒడి కార్యక్రమం ప్రకటించారని జోగి గుర్తు చేశారు. 

read more  గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అచ్చెన్నను విచారిస్తున్న ఏసీబీ

''ఎక్కడైనా ఫలానా వారికి సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేదని ప్రతిపక్షం అడుగుతుంది. ఈరోజున 42 లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తుంటే ప్రతిపక్షానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. రైతు భరోసా 49 లక్షల మంది రైతన్నలకు ఇస్తుంటే ప్రతిపక్షానికి సమస్యలు దొరకడం లేవు.  జగన్ ప్రభుత్వం మీద నిందలు వేయాలన్న ఆలోచన తప్ప ఇంకేమైనా ఉందా'' అని జోగి మండిపడ్డారు. 

 ఈరోజు సంక్షేమ ఫలాల్ని ప్రజల అకౌంట్లలోకి పంపిస్తున్న ప్రజా నాయకుడు జగన్ అని జోగి రమేష్ అన్నారు. ప్రజావేదిక కూల్చివేశారని బయల్దేరిన దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరులు రాష్ట్రంలో ప్రజాసమస్యలు ఒక్కటైనా మీరు గుర్తించారా? ప్రతిపక్షంలో ఉండి పనికిరాని వారిగా మారిపోయారని అని జోగి రమేష్ మండిపడ్డారు. ఈరోజున జగన్ ప్రభుత్వం నిబద్ధతతో, నీతితో పరిపాలన చేస్తోందని రమేష్‌ తెలిపారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ప్రజల ముందుకు తీసుకెళ్తోందన్నారు. 

ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ప్రతిపక్షాలకు లేదన్నారు. జగన్ పరిపాలనలో ఏదైనా తప్పును వేలెత్తి చూపే పరిస్థితి ఈ ప్రతిపక్షానికి లేదని.. నవరత్నాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్నారని జోగి వివరించారు. ఈ కార్యక్రమాన్ని సరిగ్గా చేయలేదని నిర్భయంగా అడిగే సత్తా ప్రతిపక్షానికి లేక..  చౌకబారు కారణాలు కల్పించుకొని వేదిక దగ్గరకు వెళ్లి సంతాపం ప్రకటిస్తారా? సిగ్గుగా లేదా? నిసిగ్గుగా ఇటువంటి చర్యలు అవసరమా అని రమేష్ మండిపడ్డారు. 

అచ్చెన్నాయుడును హత్య చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేయటం సరికాదని జోగి రమేష్ అన్నారు. అసలు అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లి మంచి వైద్యం అందించమని జగన్ సూచన చేశారని... మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఇలా చేశారని అని జోగి రమేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి  అచ్చెన్నాయుడుపై సానుభూతి ఉందని...ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. అలాంటిది అచ్చెన్నాయుడును హత్య చేయటానికి కుట్ర పన్నుతున్నారనే మాటను ఖండిస్తున్నామని జోగి రమేష్ తెలిపారు. 

రాజకీయ హత్యలు చేయటంలో పేటెంట్ హక్కుదారుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడే అని జోగి అన్నారు. దుర్మార్గపు పరిపాలన చేసి హత్యా రాజకీయాల్లో ఘనుడైన చంద్రబాబుకు, దేవినేని ఉమాలు గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. 

బీసీల నాయకుడ్ని అరెస్ట్ చేయటం తప్పని కొందరు నాయకులు అంటున్నారని.... కార్మికుల్లో.. బలహీన వర్గాలు లేరా? కార్మికుల్లో బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? మైనార్టీలు లేరా?  ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాచుకున్న ధనం రూ.151 కోట్లను దోచుకున్న అచ్చెన్నాయుడు చేసిన అరెస్ట్ చేయవద్దా? స్కాంను విచారించవద్దా? పల్లకీ ఎక్కించి ఊరేగించాలా? దయచేసి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. 

అచ్చెన్నాయుడు వెనకాల ఎవరున్నారో విచారణ తర్వాత తేలుతుందన్నారు. చంద్రబాబు, వారి అబ్బాయ్ లోకేశ్ ఏం చేశారో తర్వాత తేలుతుందని జోగి అన్నారు. అచ్చెన్నాయుడు హత్యకు కుట్ర పన్నుతున్నారన్న మాట వెనక్కి తీసుకోవాలని జోగి డిమాండ్ చేశారు. ఈరోజు అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే రేపు చంద్రబాబు వాళ్ల అబ్బాయి లోకేశ్‌, కటకటకాల పాలవుతారని జోగి హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్ ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సందర్భంలో అచ్చెన్నాయుడును ఏమైనా చేయాలన్న ఆలోచన ఎవరికి వస్తుందని జోగి రమేష్ ప్రశ్నించారు. 

దోచుకున్నా, దాచుకున్నా, స్కాం చేసినా ఆ స్కాం ప్రేరేపించిన చంద్రబాబుకు వస్తుందా? లోకేశ్‌కు, బాబుకే ఆ అవసరం ఉందన్నారు. మేమైతే కంటికి రెప్పలా అచ్చెన్నాయుడును కాపాడతామని జోగి రమేష్ అన్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు బయటపడ్డాడు. అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారి.. నా చేత ఆనాటి ముఖ్యమంత్రి, వాళ్ల అబ్బాయి లోకేశ్ చేయించారంటే.. వాళ్లే కదా రేపు అరెస్ట్ అయ్యేదని జోగి తెలిపారు. ఈ అవసరం ఎవరికి వస్తుందో ఆలోచన చేయాలని జోగి కోరారు. దయచేసి చౌకబారు మాటలు మాట్లాడవద్దని దేవినేని ఉమాకు జోగి హెచ్చరించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఇదని జోగి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios