Asianet News TeluguAsianet News Telugu

దేవాలయాల్లో వరుస ఘటనలు...చంద్రబాబు కుట్రలో భాగమే: వెల్లంపల్లి సంచలనం

ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రానికి సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకుడిగా ఉన్నానని చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. 

endowement minister vellampalli srinivas sensational comments on chandrababu
Author
Vijayawada, First Published Sep 16, 2020, 10:31 PM IST

విజయవాడ: దేవాలయాల్లో వరుస ఘటనల్లో చంద్రబాబు కుట్ర ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయగలరా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. వైసిపి హయాంలో ఏ ఒక్క దేవాలయం కూల్చలేదని, ఏదీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ప్రమాణం చేస్తానని అన్నారు. ఈ సవాల్ ను స్వీకరించకపోతే చంద్రబాబు ఎప్పటికీ హిందూ ద్రోహిగానే మిగులుతాడని మంత్రి మండిపడ్డారు. 

''ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రానికి సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనాయకుడిగా ఉన్నానని చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. సీఎం జగన్‌ పై, ఈ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా ప్రయత్నించేందుకు చాలా కుట్రలు పన్నుతున్నారు'' అని ఆరోపించారు. 

''నేను సూటిగా చంద్రబాబునాయుడిని ప్రశ్నిస్తున్నా... ఈ రోజు దేవాలయాలపై దాడుల గురించి మాట్లాడిన మాటలు అన్నీ మీ హయాంలో, గత ఐదేళ్ళ మీ పరిపాలనలో జరిగిన వాస్తవాలను ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం చాలా భాదాకరం. ఏపీలో ఇప్పుడు అమరావతి భూ కుంభకోణాన్ని తవ్వి తీస్తున్న సమయంలో ప్రజల మైండ్‌ సెట్ ను మార్చడానికి హిందూమతం మీద, దేవాలయాల మీద జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఒక కుట్రగా భావించాల్సిన అవసరం ఉంది'' అన్నారు. 

''గత ఎన్నికల ముందు నరేంద్రమోదీ అధికారంలోకి రారు అని ఆయనపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడారు. కానీ ఆయన మరోసారి ప్రధాని అయ్యేసరికి ఏదో విధంగా ఆయన కాళ్ళు పట్టుకునైనా ఏదో విధంగా ఆయనకు చేరువవ్వాలని ఏపీలో హిందూ దేవాలయాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. ఈ వంకతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

read more  విజయవాడ దుర్గగుడి సింహాల ప్రతిమల మాయం: ఇంజనీరింగ్ శాఖ అధికారుల తప్పిదమేనా

 అయితే  గత ఐదేళ్ళలో చంద్రబాబు దేవాలయాలను ఏ విధంగా కూల్చేశాడు, గోశాలలను ఏ విధంగా కూల్చేశాడు... పుష్కరాల పేరుతో ప్రజల నిధులు ఎలా కొట్టేశారు... ఇవన్నీ దాచేస్తే దాగవు. విజయవాడలో  పురాతనమైన దేవాలయాలను కూల్చడమే కాకుండా దేవుడి విగ్రహాలను కార్పొరేషన్‌ చెత్త తరలించే వాహనాల్లో తీసుకెళ్ళి పడేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు'' అని మంత్రి మండిపడ్డారు. 

''అంతర్వేది ఘటన తర్వాత అన్ని దేవాలయాల్లోని రథాలు భద్రపరచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆలయాల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగానే కనక దుర్గగుడిలో వెండి రథాన్ని కూడా భద్రపరచాలని దేవాలయ అధికారులు పరిశీలించగా అందులో 3 సింహాల బొమ్మలు కనిపించడం లేదని తెలిసింది. గత ఏడాది నుంచి కూడా దానిని వినియోగించలేదు. చంద్రబాబు హయాంలోనే ఉగాది సందర్భంగా వాడారు, ఆ తర్వాత దానిని వినియోగించలేదు. దుర్గగుడి రథంలో మాయమైన సింహాల బొమ్మల రికవరీ చేసే భాద్యత ఈ ప్రభుత్వానిది, ఎవరు తప్పు చేసినా శిక్షించే భాద్యత మాది, అది అధికారులైనా లేక మరెవరైనా. చంద్రబాబులా తప్పుకునే వ్యక్తులం కాదు'' అని పేర్కొన్నారు. 

''చంద్రబాబు హడావిడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు.  టీడీపీ హయాంలోనే సాక్షాత్తూ ట్రస్ట్‌బోర్డు మెంబర్‌ పట్టుచీరల దొంగతనం చేశారు. అదే విధంగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి బంగారు కిరీటం, ముక్కుపుడక దొంగలింపబడటం అందరికీ తెలుసు. అదే విధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగలేదా..? తన హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయంటూ మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువైంది ఏమో అనిపిస్తుంది'' అని ఎద్దేవా చేశారు. 

''ఈ రోజు రథం విషయంలో మంత్రిని బర్తరఫ్‌ చేయాలంటున్నారు. ఎంత చౌకబారు, దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారు. ఆ రోజు తన హయాంలో జరిగిన ఘటనలకు చంద్రబాబు రాజీనామా చేసి ఉంటే ఈరోజు మంత్రిని బర్తరఫ్‌ చేయాలని అడిగే నైతిక హక్కు ఉండేది. కేవలం మతాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. వాటిపై విచారణ జరుగుతుంది. అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వగానే దాని ప్రకారం ఎవరు భాద్యులైనా డిపార్ట్‌మెంట్‌పరంగా చర్యలు తీసుకుంటాం, అవసరం అయితే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు'' అని మంత్రి స్ఫష్టం చేశారు. 

''చంద్రబాబు హయాంలో సింహాచలంలో జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. భూముల కబ్జాలు, బినామీలకు ఎకరాలకు ఎకరాలు పంచిపెట్టారు, వాటన్నింటిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుంది. ఈవోని ఇప్పటికే సరెండర్‌ చేశాం. హథీరాంజీ మఠంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, బినామీలు వందల ఎకరాలు కబ్జా చేసిన చరిత్ర ఉంది
. గోదావరి పుష్కరాల సందర్భంగా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంపేసిన హంతకుడు చంద్రబాబునాయుడు. ఇది ప్రజలెవరూ మర్చిపోరు. ఈరోజు చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు'' అంటూ మంత్రి వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios