మరోసారి పోలవరం పనులు నిలిచిపోయాయి. 3 నెలలుగా కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ జీతాలు ఇవ్వటం లేదని గురువారం సిబ్బంది విధులు బహిష్కరించారు. సిబ్బంది నిరసనలతో కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి. బుధవారం నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. రాళ్లు, టైర్లు అడ్డుపెట్టి ఇతర వాహనాలు ప్రాజెక్టు సైట్లోకి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే ఆపరేటర్లు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు మొత్తం 300 మందిదాకా విధులు బహిష్కరించారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, కార్మికశాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. 2019 లో  పోలవరాన్ని సిద్ధం చేస్తామని ప్రభుత్వం ధీమాగా ఉంటే చిన్నచిన్న అరిష్టాలు ప్రాజెక్టును వెంటాడుతున్నాయి.

మరోవైపు జలవనరులశాఖ ఆఫీస్‌లో పోలవరం అథారిటీ గురువారం భేటీ అయింది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌, ఆకృతులు, ఎగువకాఫర్‌ డ్యాంపై చర్చచలు జరుగుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం కోసం జెట్‌ గ్రౌటింగ్‌ పనులను చంద్రబాబునాయుడు సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) సమావేశంలో కాఫర్‌ డ్యాంను గత డిజైన్ల మేరకే నిర్మించుకోవచ్చని ఆమోదం లభించింది.

కాఫర్‌ డ్యామ్‌ ఎత్తుతో సహా పరిమాణమూ తగ్గిస్తూ ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చిన డిజైన్‌ను ఆచరణలోకి తెస్తే పోలవరం ప్రాజెక్టుకు పెను ముప్పు వాటిల్లుతుందని డీడీఆర్‌సీ ముందు రాష్ట్ర జల వనరుల శాఖ వాదిస్తోంది. ఈరోజు సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.