ఫేస్ బుక్ లో మరో కేటుగాడు

eluru police arrested mukesh who are cheating girls in facebook
Highlights

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

ఫేస్ బుక్ లో అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని మోసం చేస్తున్న మరో కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఫేస్ బుక్ లో అమ్మాయిలకు రిక్వెస్ట్ లు పంపి పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి వాట్సాప్  నెంబర్  తీసుకొని ప్రేమాయణం నడుపుతాడు. ఆ తర్వాత మరింత దగ్గరై ప్రేమపేరుతో ఫొటోలు తీసుకుని ఆ తర్వాత డబ్బు, నగలు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతాడు. ఇది ఈ కేటుకాడి దినచర్య. ఎట్టకేలకు ఆ కేటుగాడిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఏలూరు డీఎస్పీ ఈశ్వరరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు దక్షిణపు వీధికి చెందిన చిన్నపల్లి ముఖేష్‌ సాయి(22) డిగ్రీ చదివి అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు. అతని తండ్రి రవికుమార్‌ భీమవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ముఖేష్‌ సాయి కూడా భీమవరంలోనే ఉంటున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా విశాఖపట్నానికి చెందిన పూర్ణ అనే యువతిని పరిచయం చేసుకుని ఆమె ద్వారా.. ఆమెకు వరుసకు చెల్లెలు అయిన లావణ్య అనే వివాహిత(22)తో పరిచయం పెంచుకున్నాడు.
 
ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చి ఆపై ప్రేమ వల విసిరాడు. తన మాయమాటలు నమ్మిన ఆమెతో అనేక రకాల ఫొటోలు దిగాడు. ఆమెతో చేసిన చాటింగ్‌ భద్రపర్చుకున్నాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే వాటన్నింటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని, బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించి దఫదఫాలుగా 528 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఏలూరు రామచంద్రరావుపేటకు చెందిన యువతి(21)ని కూడా ఇదే విధంగా ఫొటోల ద్వారా బెదిరించి రెండు కాసుల బంగారపు చైను తీసుకున్నాడు. ఈ క్రమంలో ముఖేష్‌ సాయిపై గాజువాకలో కేసు నమోదైంది.
 
మరోవైపు.. ఏలూరులోని త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ ఆదేశాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన ముఖేష్‌ సాయిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 450 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా డిఎస్పీ చెప్పారు. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. డీఎస్పీ మాట్లాడుతూ తెలియనివారిని ఫేస్‌బుక్‌ల్లో ఫ్రెండ్‌ రిక్వె్‌స్టను యాక్సెప్ట్‌ చేయవద్దని, వాట్సప్‌ చాటింగ్‌ చేయవద్దని యువతులకు సూచించారు.

loader