అంతుచిక్కని వ్యాధితో గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు వణికిపోతున్నారు. రోజూ పదులు సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు పోటెత్తేవారు. అయితే ఆదివారం మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నెల ఐదో తేదీ శనివారం మధ్యాహ్నం మొదలైన కేసుల పరంపర.. 12వ తేదీ శనివారం వరకు కొనసాగింది.

అకస్మాత్తుగా కిందపడిపోయి.. మూర్చతో నురగలు కక్కుతూ.. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఎనిమిది రోజుల్లో దాదాపు 615 మంది వింత వ్యాధి బారినపడగా, ఒకరు మరణించారు.

చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు రిఫర్‌ చేసిన 35 మందిలో 29 మంది డిశ్చార్జ్‌ కాగా, విజయవాడలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

వీరిని కూడా సోమవారం డిశ్చార్జ్‌ చేసే అవకాశం వుంది. ఏలూరులో ఆదివారం ఒక్క కేసూ నమోదు కాకపోవడంతోపాటు వార్డు సచివాలయాల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులకూ ఒక్క బాధితుడు కూడా రాలేదు.

దీంతో ప్రజలు, అధికారులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరులో వింత వ్యాధి ఓ మిస్టరీలా మారింది. రెండు, మూడు రోజులుగా డాక్టర్లు, నిపుణులు కారణాలను కనిపెట్టే పనిలో ఉన్నారు. నీరు కలుషితమవడమే అంతు చిక్కని వ్యాధి ప్రబలేందుకు ముఖ్య కారణమని వైద్య వర్గాలు స్థూలంగా ఓ అవగాహనకు వచ్చాయి