పార్వతీపురం మన్యంలో తప్పిన ప్రమాదం, ప్రైవేట్ బస్సుపై ఏనుగు దాడి: భయాందోళనలో ప్రయాణీకులు
విజయనగరం మన్యం జిల్లాలోని ఓ ప్రైవేట్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఏనుగును గమనించి ప్రయాణీకులు బస్సు నుండి దిగడంతో ప్రమాదం తప్పింది.
విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగు ప్రైవేట్ బస్సుపై సోమవారంనాడు దాడి చేసింది. అయితే ఈ సమయంలో బస్సు నుండి ప్రయాణీకులు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.రాయ్ ఘడ్ నుండి పార్వతీపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. కొమరాడ మండలం అర్థం అంతర్ రాష్ట్ర రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపైకి వచ్చిన ఏనుగును గమనించిన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశారు. బస్సు నుండి ప్రయాణీకులు దిగిపోయారు. రోడ్డుపై నిలిచిపోయిన బస్సును ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సును ఏనుగు వెనక్కి నెట్టివేసింది. దీంతో ఈ బస్సులోని ప్రయాణీకులు భయంతో కేకలు వేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఓ భవనంపై కూడ ఏనుగు దాడికి దిగింది. ఏనుగు ఈ రోడ్డుపై నానా హంగామా చేయడంతో రోడ్డుపైనే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మంద నుండి ఏనుగు తప్పిపోయినట్టుగా అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. గతంలో కూడ ఇదే తరహాలో ఈ ఒంటరిగా ఏనుగు పలు ప్రాంతాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినట్టుగా అటవీశాఖాధికారులు గుర్తు చేస్తున్నారు.దేశంలోని పలు చోట్ల ఏనుగులు బస్సులపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ 3న దక్షిణ కర్ణాటకలోని గుండ్యా ప్రాంతంలో బస్సుపై ఏనుగు దాడి చేసింది. రోడ్డు పక్కన నిలిచిన ఏనుగు బస్సు వెళ్తున్న సమయంలో తొండంతో దాడికి దిగింది. ఈ ఘటనలో బస్సు తీవ్రంగా దెబ్బతింది. కానీ, బస్సులోని 22 మంది ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదు.గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్న విషయాన్ని అటవీశాఖాధికారులు ధృవీకరించారు.
also read:తమిళనాడులో విషాదం: మహిళను తొక్కి చంపిన ఏనుగు
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏడాది ఆగస్టు 30న పొలంలో పనిచేస్తున్న రైతు దంపతులపై దాడి చేసింది. ఈ ఘటనలో సెల్వీ, వెంకటేష్ దంపతులు మృతి చెందారు.ఈ ఘటన జరిగిన మరునాడు తమిళనాడు రాష్ట్రంలో మేకల కాపరి వసంతపై ఈ ఏనుగు దాడికి దిగింది.దీంతో వసంత కూడ మృతి చెందింది. ఈ ఏడాది ఆగస్టు 31న రామాపురంలో ఉన్న ఏనుగును అటవీశాఖాధికారులు బంధించారు.