రాష్ట్ర ప్రజలపై మరింత భారం మోపుతూ విద్యుత్ చార్జీలను పెంచుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టాడు. ఇప్పటికయినా ప్రభుత్వం ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

అమరావతి: మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపు (electricity charges hike)తో ఏపీ ప్రజలపై భారం మోపిన జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష టిడిపి (TDP)తో పాటు బిజెపి, జనసేన, వామపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయంతో సీఎం జగన్ (YS Jagan) కు పాలించడం చేతకాదని మరోసారి నిరూపితమైందని... చంద్రబాబు పాలనతో ఈ పాలనను పోలుస్తూ మాజీ ఆర్థిక మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

''ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా విసనకర్రలు, లాంతర్ల పథకం అమలుకు జగన్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లుంది. ఈ పిచ్చి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తూ విద్యుత్ ఛార్జీలు అందుకే పెంచామని చెబుతుందేమో. ఇప్పటివరకు అప్పుల్లోనే అనుకున్నాం... అధిక విద్యుత్ ధరల్లోనూ దేశంలో ఏపీని టాప్ లో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది'' అని యనమల ఎద్దేవా చేసారు. 

''విజనరీ నాయకుడికి.. ప్రిజనరీకి ఉన్న తేడా చెప్పడానికి నేడు పెంచిన విద్యుత్ ధరలే ప్రత్యక్ష నిదర్శనం. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ధరలు పెంచకపోగా... మిగులు విద్యుత్ సాధించడం చంద్రబాబు నాయుడి (chandrababu naidu) విజన్. కానీ విద్యుత్ ఉత్పత్తీ లేక ధరలు పెంచడం నేటి ప్రిజనరీ పనికిమాలిన విధానం. గతంలో దారిద్య్ర రేఖ దిగువ ఉన్న జనాభా సంఖ్య తగ్గించేందుకు మేం ప్రయత్నించాం. నేడు జగన్ రెడ్డి వీలైనంత మందిని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలపై భారాలు వేయడం, వారి నడ్డి విరగ్గొట్టడమే ధ్యేయంగా జగన్ రెడ్డి మూడేళ్ల పాలన సాగింది'' అని మండిపడ్డారు. 

''టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా ధరలు పెంచకున్నా బాదుడే బాదుడు అంటూ అనేక సభలు, సమావేశాల్లో దీర్ఘాలు తీసారు జగన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏడుసార్లు ధరలు పెంచి 1.72 కోట్ల మందికి విద్యుత్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే స్లాబుల మార్పుతో రూ.11,600 కోట్ల భారం మోపిన జగన్ రెడ్డి... ఇప్పుడు మరో రూ.4,400 కోట్ల బాదుడుకు సిద్ధమయ్యారు'' అంటూ యనమల ఆందోళన వ్యక్తం చేసారు. 

''2014-2019 మధ్యకాలంలో వాడిన విద్యుత్తుకు సర్దుబాటు పేరుతో భారీగా ప్రజల్ని పిండేలా ప్లాన్ చేసుకోవడం అత్యంత దుర్మార్గం. సగటు వినియోగం ఆధారంగా కేటగిరీ నిర్ణయించే పద్దతి రద్దు చేసి... నెలవారీ కేటగిరీ నిర్ణయించే కొత్త విధానాన్ని తీసుకొచ్చి పేద, దిగువ మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై 45శాతానికి పైగా ధరలు పెంచిన జగన్ రెడ్డి... 400 యూనిట్ల పైబడి విద్యుత్ వాడే ధనిక వర్గాలపై మాత్రం కేవలం 6శాతం(55 పైసలు) మాత్రమే ధరలు పెంచారు. దీని ద్వారా పేదలపై తన కపట ప్రేమను జగన్ బయటపెట్టుకున్నారు'' అని యనమల అన్నారు. 

''ఆనాడు చంద్రబాబు నాయుడు ముందుచూపుతో సోలార్, విండ్ విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్తులో విద్యుత్ కష్టాలు లేకుండా చేశారు. జగన్ రెడ్డి తన సహజమైన విధ్వంసం, వికృత ఆనందపు చర్యలతో ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవడం కారణంగానే నేడు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. వేసవి కాలంలో సాధారణంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్ని ముందుగా అంచనా వేసి విద్యుత్ సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి అధిక ధరలకు కొంటున్నామని చెబుతూ ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేయడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు.

''ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోకుండా చేసేందుకే మద్యం ధరలు పెంచామన్న జగన్ రెడ్డి... నేడు విద్యుత్ ధరలు పెంపు కూడా ప్రజల మంచి కోసమే అనేలా ఉన్నారు. ఏదైనా ప్రభుత్వంలో ఏయే వస్తువుల ధరలు పెరిగాయో చూసుకునే పరిస్థితి నుండి.. ఏ రంగాలపై బాదుడు వేయలేదో చూసుకునే పరిస్థితికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చారు'' అని యనమల మండిపడ్డారు.