ఆంధ్రప్రదేశ్ లోని పరవాడలో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ బైక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. బైక్ దగ్థమయ్యింది. 

పరవాడ : ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఓ ఎలక్ట్రికల్ బైక్ దద్దమయింది. బైకు చార్జింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కలపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన బోండా సంతోష్ బైక్ కాలిపోయింది. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుడిగా సంతోష్ పని చేస్తున్నాడు. ఏడాది క్రితం ఎలక్ట్రికల్ బైక్ ను కొనుగోలు చేశాడు. రోజులాగే ఆదివారం మధ్యాహ్నం తన ఎలక్ట్రికల్ బైకు ఇంటి వరండాలో చార్జింగ్ పెట్టాడు.

అరగంట తర్వాత వరండాలో మంటలు రావడంతో.. వచ్చి చూసేసరికి బైక్ కాలిపోతుంది. దీంతో వాహనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వెలువడ్డాయి. మొదట ఈ మంటలను పక్కింటి వారు చూశారు. వారు గట్టిగా కేకలు వేయడంతో సంతోష్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికే బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ మంటలు అంటుకుని పక్కనే ఉన్న గ్రైండర్, వాషింగ్ మిషన్, కుర్చీలు లాంటి మిగతా సామాగ్రి కూడా దగ్ధమయ్యాయి.

పొగమంచుతో ప్రమాదం.. కారును ఢీ కొట్టిన ఊకలారీ.. ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు..

ఇదిలా ఉండగా, నిరుడు మేలో తెలంగాణలో ఇలాంటి ఘటనే జరిగింది. భైంసా మదీనా కాలనీలో అర్ధరాత్రి ఎలక్ట్రికల్ బైక్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమయ్యింది. కాలనీలో నివాసం ఉంటున్న అబ్దుల్ ఆహాద్ రాత్రి ఎలక్ట్రికల్ బైక్ ను పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. నిమిషాల వ్యవధిలోనే బైక్ కు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించి దగ్ధమయ్యింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమత్తమై అక్కడి ప్రాంతంలోని ఇతర వాహనాలను మంటల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

ఎలక్ట్రికల్ బైక్ కు వ్యాపించిన మంటలను ఆర్పివేసే సమయానికే బైక్ కు చెందిన పరికరాలు అధిక శాతం దగ్ధమయ్యాయి. ఆరునెలలుగా వాడుతున్నట్లు యజమాని అబ్దుల్ ఆహాద్ పేర్కొన్నారు. కాగా, నిరుడు మే 12న తెలంగాణలో మరో ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు లేచాయి. రాష్ట్ర రాజధాని ఎల్బీనగర్ చౌరస్తాలో ఓ ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. ఓ డెలివరీ బాయ్ ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతి అయింది. డెలివరీ బాయ్ ఆర్డర్ పికప్ చేసుకుని వచ్చే సరికి అతని ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు లేచాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు లేచాయి. పెద్ద యెత్తున లేచిన మంటలకు అక్కడివారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ లో అగ్నికి ఆహుతి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ లో ఇలాగే ఓ ఎలక్ట్రిక బైక్ తగలబడింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ పేలింది. వివరాలు.. ఎగుర్ల ఓదెలు రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. 

ఎప్పటిలాగే ఆ రోజు రాత్రి పడుకునే ముందు బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే చార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాటరీలో పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ.. ఇంటి బయట బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడం.. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. కాకపోతే, ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.