పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పొగ మంచు అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని కొండపర్వ అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నలారీకి కారు కనిపించకపోవడంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కొత్త లాల్ గుప్తా(54), సంకా సునీత (48) అనే ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

కారులో ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సునీత, రాంబాబు భార్యాభర్తలు. వీరు విసన్నపేటలో ఉంటారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కూతురుని చూసేందుకు శనివారం కారు మాట్లాడుకుని విజయవాడకు వెళ్లారు. కూతుర్ని చూసిన తరువాత ఆదివారం తెల్లవారుజామున తిరిగి విస్సన్నపేటకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అడ్డరోడ్డు సమీపంలోకి రాగానే అక్కడ లారీ ఢీ కొట్టింది. తీవ్రమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.