రేపు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
రేపు ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు, కాలేజీలకు విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో ఉక్కు పరిశ్రమ సాధన డిమాండ్లతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన నిరసన రేపటికి వెయ్యి రోజులు చేసుకుంటున్నది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాయి. రెండు డిమాండ్లతో విద్యార్థి, యువజన సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ సహా పలు విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు పిలుపు ఇచ్చాయి.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తారన్న వార్తలు రావడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా పరిరక్షించాలనే లక్ష్యంతో కార్మికులు నిరసనలు మొదలు పెట్టారు. ఈ నిరసనలు బుధవారానికి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్బంగానే వారికి సంఘీభావంగా విద్యార్థి, యువజన సంఘాలు రేపు రాష్ట్రంలో విద్యా సంస్థలకు బంద్ ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరాయి.
లాభాలు ఆర్జిస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం తగదని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. విశాఖకు ఇనుము, ఉక్కు గనులు కేటాయించకపోవడాన్ని నిరసించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాలని అనుకున్నాయి.
Also Read: కోహ్లీ గొప్పోడు అని చెప్పడానికి సచిన్ రికార్డులే అవసరం లేదు! రికీ పాంటింగ్ ప్రశంస..
అలాగే, రాష్ట్ర విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని విద్యార్థి సంఘాలు గుర్తు చేశాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానికంగా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించాయి.